మోడీ సర్కార్‌కు బంపర్ డివిడెండ్
రూ. 2.86 లక్షల
కోట్ల చెల్లింపు..!
ఆమోదించిన సెంట్రల్ బ్యాంక్ బోర్డు
స్వయం ప్రతిపత్తికి ఎసరు
ముంబయి : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఖజానాను ఖాళీ చేయాలనే ప్రధాని మోడీ లక్ష్యం క్రమంగా నెరవేరుతోంది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2025-26కు గాను ఆర్బీఐ రూ.2.86 లక్షల కోట్ల భారీ డివిడెండ్‌ను ప్రకటించింది. ఇంతక్రితం 2024-25లో రూ.2.69 లక్షల కోట్లు కేటాయించింది. 2022-23 నాటి రూ.87,416 కోట్ల డివిడెండ్‌తో పోల్చితే మూడేండ్లలోనే నాలుగు రెట్ల మేర పెంచేసింది.శుక్రవారం ముంబయిలో గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జరిగిన ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ 623వ సమావేశంలో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను సమీక్షించిన అనంతరం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2025 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా రూ. 2,86,588.46 కోట్ల ఆల్‌టైం రికార్డు స్థాయి నిధులను డివిడెండ్ రూపంలో బదిలీ చేసేందుకు ఆర్బీఐ సెంట్రల్ బోర్డు ఆమోదం తెలిపింది. ఇంత్రకితం ఏడాది కేటాయింపులతో పోల్చితే ఇది 6.7 శాతం ఎక్కువ కావడం విశేషం.
దేశ, విదేశీ సెక్యూరిటీలపై వచ్చే వడ్డీ, సేవలపై రుసుములు, కమీషన్లు, విదేశీ మారకపు ద్రవ్య లావాదేవీలపై లాభాలు, అనుబంధ సంస్థల ప్రతిఫలాల ద్వారా ఆర్బీఐకి ఆదాయం లభిస్తుంది.
ఈ ఆదాయం నుంచి నోట్ల ముద్రణ, డిపాజిట్లు, రుణాలపై వడ్డీలు, సిబ్బంది జీతభత్యాలు, పింఛన్లు, కార్యా లయాల నిర్వహణ ఖర్చులు, ఆకస్మిక పరిస్థితులు, తరుగుదల కేటాయింపులను మినహాయించగా మిగిలే మొత్తాన్ని మిగులు నిధులుగా పరిగణించి కేంద్రానికి బదిలీ చేస్తారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ డివిడెండ్ నిరంతరం పెరుగుతూ వస్తోంది. 2024-25లో ఆర్బీఐ నికర ఆదాయం రూ. 3.13 లక్షల కోట్ల నుంచి ప్రస్తుత 2025-26 రూ. 3.96 లక్షల కోట్లకు చేరిందని బోర్డు తెలిపింది. ఇదే సమయంలో కేంద్ర బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ పరిమాణం 20.61 శాతం పెరిగి రూ. 91,97,121.08 కోట్లకు చేరిందని వెల్లడించింది. ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో డిప్యూటీ గవర్నర్లు స్వామినాథన్ జె, పూనమ్ గుప్తా, రోహిత్ జైన్లతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా, వేణు శ్రీనివాసన్ తదితర బోర్డు డైరెక్టర్లు పాల్గొన్నారు.
స్వయంప్రతిపత్తి ఎసరు
ప్రభుత్వం తన బడ్జెట్ లో ఆర్బీఐ ఇతర బ్యాంకుల నుంచి రూ. 3.16 లక్షల కోట్లు వస్తాయని ముందే అంచనా వేసింది. దానికి తగ్గట్టే ఆర్బీఐ తన రక్షణ నిధుల శాతాన్ని తగ్గించుకుని మరీ రికార్డు స్థాయిలో డివిడెండ్ ఇవ్వడం చూస్తుంటే కేంద్ర బ్యాంక్ స్వయంప్రతిపత్తిపై, దాని నిధుల నిర్వహణపై ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెస్తోందనే అనుమానాలకు బలం చేకూరుస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.



