చదువు + జీవన నైపుణ్యం – సంపూర్ణ విద్య

Education + Life Skills - Holistic Educationచదువు కేవలం ఉన్నత ఉద్యోగ అవకాశాలు చేజిక్కించుకోవటం కోసమే కాదు, నాణ్యమైన జీవితాన్ని అనుక్షణం పొందేందుకు అని ఆర్తితో చెప్తాడు రచయిత వి.సోమిరెడ్డి. జీవన నైపుణ్యాల కోసం ‘చదువులు’ అంటూనే… పుస్తక ప్రపంచం నుండి ప్రపంచ పుస్తకంలోకి తీసుకెళ్ళేవే నిజమైన విద్యాలయాలు అని గొంతెత్తి నినదిస్తాడు.
140 కోట్లకు పైగా జనాభా వున్న మన భారతదేశంలో ముప్పై ఏళ్ల లోపు వయసు వున్నవారు 60 శాతం మంది. అంటే 84 కోట్లమంది. వీరిలో సగం మంది అంటే 42 కోట్ల మంది (3- 18 సంవత్సరాల మధ్యవయసు వున్నవారు) పాఠశాల, ఇంటర్‌ విద్యను అభ్యసించే స్థాయి కలవారు. ప్రతి 50 మంది పిల్లలకు ఒక టీచర్‌ను అనుకున్నా 84 లక్షల మంది కావాలి.
మరి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో నిజంగా అన్ని లక్షలమంది టీచర్లు వున్నారా..? ఆటస్థలాలు… గ్రంథాలయాలు, ప్రయోగశాలలు.. తరగతి గదులు ఆ విధంగా వున్నాయా..? అంటే కచ్చితంగా లేవు అనే సమాధానం వస్తుంది. తత్‌కారణంగా ప్రతి ముగ్గురిలో ఒకరు బడికి వెళ్లలేకపోవడం గాని, మధ్యలోనే బడి మానేయడం గాని (డ్రాప్‌అవుట్‌) జరుగుతోంది. పైగా మన యంగ్‌ ఇండియాను డ్రగ్‌ ఇండియాగా మార్చేందుకు పాఠశాల స్థాయి వరకు డ్రగ్స్‌ చాక్లెట్స్‌ రూపంలో రావడం అత్యంత విషాదకరం.
ఇలాంటి నేపథ్యంలో జీవన నైపుణ్యాల కోసం ‘చదువులు’ అన్న పుస్తకం చదివినవారికి ఎడారిలో ఒయాసిస్సులా కనిపిస్తుంది. అటు తల్లిదండ్రులకు, పెద్దలకు, ఇటు ఉపాధ్యాయులకు, విద్యావేత్తలకు సమాంతరంగా ఏకపత్ర సమారాధన చేస్తుంది. కొండకచో మంచి విద్య కోసం సొంతంగా పాఠశాలను నెలకొల్పుకుందాం అన్నవారికి మార్గదర్శకత్వం చూపుతుంది.
‘పిల్లలకు జీవితం సంపాదించే విద్యతోపాటు జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకుని నిలవగలిగే విద్యను కూడా ఇవ్వగలగాలి. తను ఆనందంగా వుంటూ తను చుట్టూ వున్న సమాజాన్ని ఆనందంగా వుంచగలిగే పౌరుడిలా తీర్చిదిద్దే విద్య కావాలి. అలాంటి పాఠశాలల్లో చదివిన పిల్లలు ఎక్కడైనా బతకగలుగుతారు…’ అంటున్న సోమిరెడ్డికి విద్యపట్ల ఓ విస్పష్టమైన దృక్పథం (పర్‌స్పెక్టివ్‌) వున్నట్లు ప్రత్యేకించి చెప్పకనే తెలుస్తున్నది. ఇదే కీలకమైన విషయం.
పిల్లలు బాల్యాన్ని సంపూర్ణంగా అనుభవించాలంటే ఆటలు తప్పనిసరి అంటూనే, ఆది మానవుడు అంతరిక్ష యాత్రికుడిగా మారాడంటే అది మనిషిలోని శాస్త్రీయ దృక్పథం వల్లనే అని వక్కాణిస్తాడు.
తల్లిదండ్రులు తమ పిల్లల వికాసానికి ఎలా బాటలు పరవాలో చెప్తూనే… బడిలో చేర్పించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో విశదపరుస్తున్నాడు.
‘విద్యనేర్పడం అనేది కేవలం పాఠశాలకు మాత్రమే సంబంధించిన అంశం కాదు. సంపూర్ణ విద్య అంటే జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పేది. పాఠశాల మాత్రమే జీవితాన్ని తీర్చిదిద్దలేదు. ఇందులో తల్లిదండ్రులుగా మీ పాత్ర ఎంతో బహు ముఖ్యమైనది. మీరు చూపించే మార్గాలు, వేసే అడుగులు మార్గనిర్దేశకత్వం మీ పిల్లలను తీర్చిదిద్దేందుకు దోహదపడతాయని చెప్తూ ‘సంపూర్ణ విద్య అంటే చదువు + జీవన నైపుణ్యం’ అని నిర్వచిస్తాడు.
తాను ఏదైతే పుస్తకంలో తెలిపాడో వాటిని ఆచరణలో గరిష్టస్థాయిలో త్రికరణశుద్ధిగా పాఠించేందుకు కృషిచేస్తున్నాడు. అదే కోదాడలోని తేజ విద్యాలయం.
పిల్లలు – పుస్తకాలు, మాతృభాష అవసరం, కథలే సృజనకు శ్రీకారం. ప్రత్యామ్నాయ విద్యే పరిష్కారం, ఆచార్యుని అంతరంగం, మీ పిల్లల భవిష్యత్‌ మీ చేతుల్లోనే వంటి శీర్షికలతో దాదాపు 70 పేజీలు గల పుస్తకం వర్ణ చిత్రాలతో మనల్ని అలరిస్తుంది. ఆలోచింపచేస్తుంది. పిల్లలతో కలిసి పనిచేయాలనే ఉత్సుకతను కలిగిస్తుంది.
– కె.శాంతారావు, 9959745723

Spread the love