నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వల్ల కుటుంబ రోడ్డు పాలు

– ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ డ్రైవింగ్‌ చేయాలి
– రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివాస్‌
– కమిషనరేట్‌ పరిధిలో డ్రైవర్స్‌గా విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ సిబ్బందికి అవగాహన
నవతెలంగాణ-గోదావరిఖని:
చిన్న నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కుటుంబ భవిష్యత్తును రోడ్డు పాలు చేస్తుందని, ఎల్లప్పుడూ అప్రమ త్తంగా ఉంటూ డ్రైవింగ్‌ చేయాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివాస్‌ సూచించారు. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో అధికారుల వద్ద డ్రైవింగ్‌ విధులు నిర్వహిస్తున్న 50 మంది సిబ్బందికి రామగుండం కమిషనరే ట్‌లో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా హాజరై డ్రైవర్స్‌కి పలు సూచనలు, సలహాలు, జాగ్రత్తలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంచి కండిషన్లో ఉంచుకోవాలని వాహన డ్రైవర్లకు ఆదేశించారు. పోలీసు అధికారుల ఆధీనంలో ఉన్న వాహనాలను సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, సొంత వాహనంలా మంచి కండిషన్లో ఉంచి ఎప్పటికప్పుడు సర్వీసింగ్‌, ఇంజన్‌ఆయిల్‌, టైర్ల నిర్వహణ చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాల వలన 1,69,000 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, 4 లక్షల మంది క్షతగాత్రులు అయ్యారని, ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుందని అన్నారు. కాబట్టి ఒక చిన్న నిర్లక్ష్యపు కారణం వలన ప్రమాదం సంభవించి వారి కుటుంబ భవిష్యత్తు రోడ్డు పాలవడం జరుగుతుందన్నారు. వాహనంలో కూర్చొని ప్రయాణించేటప్పుడు అలర్టుగా వుండి, పరిసరాలు నిశితంగా గమనిస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు. డ్రైవర్‌లు విశ్రాంతి సమయంలో విశ్రాంతి తీసుకోకుండా అనవసరంగా సమయం వృధా చేసుకొని వాహనం నడుపు సమయంలో ఇబ్బందిగా వాహనం నడపకూడదని అన్నారు. ఏలాంటి ఆనందమైన విషయం ఐనా, సంతోకరమైన విషయం ఐనా, బాధకరమైన లేదా ఎలాంటి సమస్య ఉన్న వాహనం ఎక్కే వరకే ఉంచాలని,ఒక్కసారి డ్రైవింగ్‌ సీట్‌లో కూర్చున్నాక పూర్తి స్థాయిలో దృష్టి డ్రైవింగ్‌పైనే ఉండాలని, లేకపోతే ఏదో ఆలోచనలో ఉండి వాహనం ప్రమాదానికి గురై అవకాశం ఎక్కువ ఉంటుందని అన్నారు. ఏదైనా ఆరోగ్య,కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు అధికారులకు తెలియచేయాలని, మీ స్థానంలో వేరొక డ్రైవర్‌ని పంపడం జరుగుతుందని, చెప్పకుండా డ్రైవింగ్‌ కష్టపడుతూ చేయడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ రాజు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏఆర్‌ ఏసీపీ ప్రతాప్‌, ఆర్‌ఐ ఎంటివో మధు, ఆర్‌ఐ మల్లేశం, శ్రీనివాస్‌, రామగుండం ఎంవీఐ మధు, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Spread the love