Saturday, September 5, 2026
E-PAPER
Homeఖమ్మంకత్తిమీద సామైన ఉపాధ్యాయ వృత్తిలో ప్రతిభకు గుర్తింపు

కత్తిమీద సామైన ఉపాధ్యాయ వృత్తిలో ప్రతిభకు గుర్తింపు

- Advertisement -

– జిల్లా స్థాయిలో అశ్వారావుపేట కు ఇద్దరు ఉత్తమ ఉద్యోగులు 
– మండల స్థాయిలో 26 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం
నవతెలంగాణ – అశ్వారావుపేట

వృత్తి ఏదైనా బాధ్యతగా నిర్వహిస్తే గుర్తింపు దానంతట అదే వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉపాధ్యాయ వృత్తి ఒకప్పుడు ఎలాంటి ఒత్తిడి లేని ఉద్యోగంగా పేరుండేది. అయితే మూడు దశాబ్దాల క్రితం నాటి పరిస్థితులు నేడు లేవు. విద్యారంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది.

బడి ఉంటే సౌకర్యాలు ఉండవు..సౌకర్యాలు ఉంటే విద్యార్థులు ఉండరు. విద్యార్థులు ఉన్నా సరిపడా ఉపాధ్యాయులు ఉండరు. దీనికి తోడు ఆధునికత, సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులపై చూపుతున్న ప్రభావం కూడా విద్యారంగంలో అనేక మార్పులకు కారణమవుతోంది. ఇలాంటి వైరుధ్యాల నడుమ ఉపాధ్యాయ వృత్తి నేడు కత్తిమీద సాముగా మారింది.

ఇంతటి ఒత్తిడి మధ్య కూడా విద్యార్థులను మెప్పిస్తూ, వారికి విద్యాబుద్ధులు నేర్పుతూ, విధుల్లో ప్రతిభ కనబరచడం అంత సులభం కాదు. అలాంటి పరిస్థితుల్లోనూ తమ పనితీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని జిల్లా స్థాయి ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక కావడం అభినందనీయం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో అశ్వారావుపేట మండలానికి చెందిన ఇద్దరికి జిల్లా స్థాయి ఉత్తమ ఉద్యోగుల అవార్డులు లభించాయి. మండల స్థాయిలో మరో 26 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై సత్కారం అందుకున్నారు.

అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం ఎంపీయూపీఎస్ పీఎం శ్రీ పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఎల్. రేణుక, విద్యా వనరుల విభాగంలో సీఆర్పీగా విధులు నిర్వహిస్తున్న ప్రముఖ కవి, రచయిత, సాహితీ హితైషి సిద్ధాంతం ప్రభాకరాచార్యులు జిల్లా స్థాయి ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికయ్యారు. కొత్తగూడెంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారి, ఎంఈఓ ప్రసాదరావు తదితరులు వారిని అభినందించారు.

అదేవిధంగా మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 26 మందిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అభినందన సభలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఎంఈఓ ప్రసాదరావు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు హరిత, షాహినా బేగం, కొండలరావు, వీరేశ్వరరావు, సింగపోగు వెంకటేశ్వరరావు తదితరులు అభినందించారు.

విద్యారంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణం లోనూ అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు లభిస్తున్న ఈ గుర్తింపు, మరింత బాధ్యతతో పనిచేసేందుకు స్ఫూర్తినిస్తుందని పలువురు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -