తగ్గిన క్యాంపస్‌ నియామకాలు

Reduced campus placements– ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 50-70% తగ్గుదల
న్యూఢిల్లీ : దేశంలోని ప్రయివేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో క్యాంపస్‌ నియామకాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. నియామకాల్లో 50 శాతం నుంచి 70 శాతం వరకూ తగ్గుదల కన్పిస్తోంది. ఐటీ రంగంలో కంపెనీలు ఆర్థికపరమైన సవాళ్లను ఎదుర్కోవడమే దీనికి కారణం. అనేక విద్యా సంస్థలు తమ ప్రణాళికలపై పునరాలోచన చేస్తున్నాయి. కొన్ని సంస్థలు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నాయి. క్లయింట్ల నుండి రాబడి అధికంగా ఉండడంతో గతంలో ఐటీ కంపెనీలు గత రెండేళ్లలో ఫ్రెషర్లను బాగానే నియమించాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. క్లయింట్ల నుంచి బిల్లుల చెల్లింపు ఆలస్యమవుతోంది. దీంతో కంపెనీలు ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. ఐటీలోనే కాకుండా ఆటోమొబైల్స్‌, ఏరోనాటిక్స్‌, బయోటెక్నాలజీ, బయోమెడికల్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌ వంటి రంగాల్లో కూడా నియామకాలు తగ్గిపోవడమో లేదా స్థిరంగా ఉండడమో జరుగుతోంది. తమ యూనివర్సిటీలో గత సంవత్సరం 63 శాతం మంది విద్యార్థులు ఎంపికయ్యారని, ఇప్పుడు వారి సంఖ్య 20-25 శాతానికి తగ్గిందని బీఎంఎల్‌ మజుందార్‌ విశ్వవిద్యాలయానికి చెందిన సీనియర్‌ డైరెక్టర్‌ సంతానిల్‌ దాస్‌గుప్తా చెప్పారు. తమ సంస్థలో ఇప్పటి వరకూ 30 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉద్యోగాలు పొందగలిగారని అమిటీ యూనివర్సిటీ ప్లేస్‌మెంట్‌ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ అంజని కుమార్‌ భట్నాగర్‌ తెలిపారు. నియామకాల పరిస్థితి నిరాశాజనకంగా ఉన్నదని కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ సీనియర్‌ ప్లేస్‌మెంట్‌ డైరెక్టర్‌ శరవణబాబు అన్నారు. గాల్‌గోటియాస్‌ యూనివర్సిటీలో ఈ నెల మొదటి వారం నాటికి 45 శాతం మంది చివరి సంవత్సరం విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయి. కంపెనీలు వచ్చినా కొద్ది మందిని మాత్రమే తీసుకుంటున్నాయని విద్యా సంస్థలు అంటున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది క్యాంపస్‌ నియామకాలు 5-7% తగ్గాయని తెలిపాయి.

Spread the love