ఈపీఎఫ్‌ఓలో తగ్గిన కొత్త సభ్యులు

ఈపీఎఫ్‌ఓలో తగ్గిన కొత్త సభ్యులున్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ)లో కొత్త సభ్యుల చేరిక తగ్గిపోయింది. గత సంవత్సరంతో పోలిస్తే 2023-24లో కొత్త చందాదారుల సంఖ్య 4 శాతానికి తగ్గి 10.9 మిలియన్లకు చేరిందని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక తెలిపింది. 2022-23లో ఈపీఎఫ్‌ఓలో 11,498,453 మంది కొత్త సభ్యులు అదనంగా చేరగా 2023-24లో 10,993,119 మాత్రమే చేరారు. నూతన సభ్యుల చేరిక తగ్గడానికి కోవిడ్‌ కూడా కారణమేనని భావిస్తున్నారు. 2019-20లో 11,040,683 మంది కొత్త సభ్యులు చేరగా 2020-21లో 8,548,898 మంది చేరారు. 2021-22లో సభ్యుల సంఖ్య మళ్లీ పెరిగి 10,865,063కు చేరింది.
ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2020, 2021లో పలు ఆంక్షలు విధించాయి.
ఫలితంగా ఆర్థిక కార్యకలాపాలు, ఉద్యోగాలపై ప్రభావం పడింది. 2023-24కు ముందు ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఈపీఎఫ్‌ఓలో చేరిన నూతన సభ్యుల సంఖ్య కోవిడ్‌కు ముందున్న 2018-19 స్థాయికి చేరుకోలేకపోయింది. 2018-19లో ఈపీఎఫ్‌ఓలో 13,944,349 మంది కొత్త సభ్యులు చేరారు. కాగా ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ)లో కూడా నూతన సభ్యుల చేరిక తగ్గింది. 2022-23లో 17,760,672 మంది సభ్యులు చేరితే 2023-24లో మంది 16,773,023 మాత్రమే చేరారు. జాతీయ పెన్షన్‌ పథకం (ఎన్‌పీఎస్‌)లో మాత్రం నూతన చందాదారుల సంఖ్య పెరిగింది.

Spread the love