నవతెలంగాణ-ఆలేర్ రూరల్
రాష్ట్ర ప్రభుత్వం సన్న వరి సాగును ప్రోత్సహించేందుకు ఎంపిక చేసిన ఏడు రకాల సన్న వరి విత్తనాల వివరాలను రైతులు సెప్టెంబర్ 18లోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని ఆలేరు సహాయ వ్యవసాయ సంచాలకులు నిర్మల సూచించారు. సన్న వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసే సమయంలో క్వింటాలుకు రూ.500 బోనస్ అందించనున్న నేపథ్యంలో విత్తనాల నమోదు ప్రక్రియకు ప్రాధాన్యం ఏర్పడింది. గొలనుకొండ గ్రామంలో సన్నధాన్యం సాగు పరిస్థితులను, డిజిటల్ క్రాప్ సర్వేను సహాయ వ్యవసాయ సంచాలకులు నిర్మల, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు సన్న వరి విత్తనాల నమోదు, డిజిటల్ క్రాప్ సర్వే ప్రాధాన్యాన్ని వివరించారు.
ప్రభుత్వం ఎంపిక చేసిన బీపీటీ-5204, ఆర్‌ఎన్‌ఆర్-15048 (తెలంగాణ సోనా), హెచ్‌ఎంటీ సోనా, డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి), కేఎన్‌ఎం-1638, కేఎన్‌ఎం-7715,జైశ్రీరాం రకాల సన్న వరిని సాగు చేస్తున్న రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన డీలర్ వద్ద పట్టాదారు పాస్‌బుక్, మొబైల్ నంబర్‌తో వెళ్లి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలని అధికారులు సూచించారు.
డీలర్ వద్ద కాకుండా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు,పరిశోధనా కేంద్రాల నుంచి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు, అలాగే సొంత విత్తనంతో సన్న వరి సాగు చేస్తున్న రైతులు స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని వ్యవసాయ శాఖ అధికారులకు సమర్పించి సన్నధాన్యం సాగు చేసినట్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ప్రక్రియను 2026 సెప్టెంబర్ 18లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అదేవిధంగా మండలంలో ప్రైవేట్ సర్వేయర్ల ద్వారా డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైతులు సర్వేకు సహకరించి తమ సర్వే నంబర్లలో సాగు చేసిన పంటల వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు.పంటల వివరాలు సక్రమంగా నమోదైతే ప్రభుత్వ పథకాలు,పంట కొనుగోలు ప్రక్రియలో రైతులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి అంజయ్యతో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు.



