Tuesday, August 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం​అక్రమ దత్తత కేసులపై ‌నివేదిక ఇవ్వండి

​అక్రమ దత్తత కేసులపై ‌నివేదిక ఇవ్వండి

- Advertisement -

శిశువుల అక్రమ రవాణాను అడ్డుకోవాలి
మహారాష్ట్రలో గ్రామస్థాయి వ్యవస్థను పరిశీలించాలి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అక్రమ దత్తత ఆరోపణల నేపథ్యంలో రక్షణలోకి తీసుకున్న చిన్నారుల పరిస్థితి, వారి అసలు తల్లిదండ్రుల వివరాల సేకరణకు అధికారులు చేపట్టిన చర్యలు, కుటుంబ నేపథ్యంపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సూర్యాపేటలో వెలుగుచూసిన అక్రమ దత్తత వ్యవహారంలో గుర్తించిన తొమ్మిది మంది చిన్నారుల విషయంలో వారి కన్న తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారనీ, వారిని గుర్తించేందుకు అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేశారనే అంశాలను స్పష్టంగా తెలపాలని ధర్మాసనం పేర్కొంది. పిల్లలను రక్షణలోకి తీసుకున్న వెంటనే దత్తతకు అందుబాటులో ఉన్నవారిగా నమోదు చేయడం సరైన విధానం కాదనీ, ముందుగా వారి తల్లిదండ్రులు, పిల్లలను సంరక్షిస్తున్న కుటుంబ సభ్యుల ఆచూకీ లభించడం లేదనీ, వారిని గుర్తించే అవకాశాలు కూడా లేవని నిర్ధారించిన తర్వాతే ఆ ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేసింది.
పిల్లల సంక్షేమ కమిటీ అనుసరించిన విధానంపైనా ధర్మాసనం ప్రశ్నలు లేవనెత్తింది. నల్లగొండ జిల్లా సూరారం మండలానికి చెందిన ఎం వెంకన్న, ఆయన భార్య 2023లో దత్తత తీసుకున్న చిన్నారిని పోలీసులు స్వాధీనం చేసుకుని స్త్రీ, శిశు సంక్షేమశాఖకు అప్పగించడాన్ని సమర్థిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీలుపై చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్, జస్టిస్‌ జిఎం మొహియుద్దీన్‌ల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అక్రమ దత్తతకు గురైన‌ట్టు అనుమానించి రక్షణలోకి తీసుకున్న చిన్నారుల సంఖ్య, ప్రస్తుతం వారు ఏ బాలల రక్షణ గృహాల్లో ఉన్నారనీ, వారి తల్లిదండ్రులను గుర్తించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా శిశువుల అక్రమ రవాణాను అడ్డుకోవడం, అదృశ్యమైన చిన్నారులను త్వరగా గుర్తించడం కోసం మహారాష్ట్రలో అమలు చేస్తున్న గ్రామస్థాయి వ్యవస్థను తెలంగాణలోనూ పరిశీలించాలని సూచించింది. అక్కడ అంగన్‌వాడీ, పాఠశాల సిబ్బంది భాగస్వామ్యంతో వేలాది గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించింది.
ఇలాంటి పర్యవేక్షణ వ్యవస్థ రాష్ట్రంలో ఎంతవరకు ఉపయోగపడుతుందో పరిశీలించాలని తెలిపింది. రక్షణలో ఉన్న చిన్నారుల వివరాలతోపాటు వారి కుటుంబాల పరిస్థితి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఇతర సహాయ కార్యక్రమాల వివరాలను కూడా నివేదికలో పొందుపర్చాలని ధర్మాసనం ఆదేశించింది. అక్రమ దత్తత వెనక ఉన్న పరిస్థితులను మాత్రమే కాకుండా పిల్లల అసలు కుటుంబాలను గుర్తించడం, వారికి అవసరమైన ప్రభుత్వ సహాయాన్ని అందించడం కూడా సమాంతరంగా జరగాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చేనెల రెండోతేదీకి వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -