ఇండియాలో అన్ని కులాలకూ ప్రాతినిధ్యం

ఇండియాలో అన్ని కులాలకూ ప్రాతినిధ్యం– ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకూ సముచిత స్థానం
– ఎన్డీఏ ఎంపీల్లో కానరాని ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు
– అగ్ర కులాలకే అధిక ప్రాధాన్యత
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల సమరంలో కులాలు ప్రధాన పాత్ర పోషించాయి. అటు అధికార ఎన్డీఏ, ఇటు ప్రతిపక్ష ఇండియా ఫోరం సామాజిక న్యాయాన్ని పరస్పర విరుద్ధమైన దృష్టితో చూశాయి. ఒకే మతం నీడన హిందూ కులాలను ఏకం చేసేందుకు బీజేపీ ప్రయత్నించింది. మరో వైపు సామాజిక న్యాయ సాధనకు కులం కీలకమైన సాధనమని ప్రతిపక్ష కూటమి భావించింది. మొత్తంమీద ఎన్డీఏతో పోలిస్తే ఇండియా బ్లాక్‌ లోనే వివిధ కులాలు, వర్గాలకు సముచిత ప్రాధాన్యత లభించినట్టు కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో 2019, 2024 ఎన్నికల్లో దిగువసభలో వివిధ కులాలు, వర్గాలకు లభించిన ప్రాతినిధ్యాన్ని పరిశీలిస్తే…
ఏ కులం వారు ఎందరు?
17వ లోక్‌సభ సభ్యుల్లో 28.5 శాతం మంది అగ్రకులాల వారు ఉండగా 18వ సభకు 25.8 శాతం మంది మాత్రమే ఎన్నికయ్యారు. కర్నాటకకు చెందిన ఒక్కళిగులు, తమిళనాడులోని వెల్లలాలు, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లోని జాట్లు, బీహార్‌లోని కుర్మీలు, కొయిరీలు, మధ్యప్రదేశ్‌లోని లోధాలు, ఆంధ్రప్రదేశ్‌లోని కమ్మ, రెడ్లు…ఇలా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన కులాల వారు గత సభలో 14.4 శాతం మంది ఉంటే రాబోయే సభలో 13.6 శాతం మంది ఉంటారు. ఓబీసీల సంఖ్య 22.8 శాతం నుంచి 25.4 శాతానికి పెరిగింది. ఎస్సీల సంఖ్య 15.5 శాతం నుంచి 15.8 శాతానికి స్వల్పంగా పెరగ్గా ఎస్టీల సంఖ్య 10.1 శాతం వద్ద స్థిరంగా ఉంది. ముస్లింల సంఖ్య 5.0 శాతం నుంచి 4.4 శాతానికి తగ్గింది. క్రైస్తవుల సంఖ్య అప్పుడు, ఇప్పుడూ 1.3 శాతంగానే ఉంది. సిక్కుల సంఖ్య 2.0 శాతం నుంచి 2.4 శాతానికి పెరిగింది. గత లోక్‌సభలో బౌద్ధులు 0.2 శాతం మంది ఉంటే ఇప్పుడు ఒక్కరు కూడా లేరు. గుర్తించని కులాల వారు గత సభలో 0.2 శాతం మంది ఉంటే 18వ లోక్‌సభలో వారి సంఖ్య 1.1 శాతానికి పెరుగుతుంది.
హిందీ రాష్ట్రాల్లో…
హిందీ రాష్ట్రాల్లో కులాలు, వర్గాల ప్రాతినిధ్యాన్ని పరిశీలిస్తే… అగ్ర కులాల వారి సంఖ్య 38.9 శాతం నుంచి 32.7 శాతానికి తగ్గిపోయింది. కొన్ని ప్రాంతాలకే పరిమితమైన కులాలకు చెందిన వారి సంఖ్య 6.2 శాతం నుంచి 6.6 శాతానికి పెరిగింది. ఓబీసీ సభ్యుల సంఖ్య కూడా 25.7 శాతం నుంచి 31.0 శాతానికి పెరిగింది. ఎస్సీల సంఖ్య 17.3 శాతం నుంచి 17.7 శాతానికి, ఎస్టీల సంఖ్య 8.0 శాతం నుంచి 8.4 శాతానికి పెరిగింది. హిందీ రాష్ట్రాల నుంచి ముస్లింల ప్రాతినిధ్యం మాత్రం 3.5 శాతం నుంచి 3.1 శాతానికి తగ్గిపోయింది.
కూటముల వారీగా…
కులాలు, వర్గాల వారీగా ఎన్డీఏ, ఇండియా ఫోరం తరఫున లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల వివరాలను పరిశీలిస్తే…ఎన్డీఏ ఎంపీల్లో అగ్రకులాల వారు 33.2 శాతం, ఇండియా బ్లాక్‌కి చెందిన వారు 12.4 శాతం మంది ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే కన్పించే కులాలకు సంబంధించిన సభ్యులు ఎన్డీఏ పక్షాన 15.7 శాతం మంది ఎన్నికైతే ఇండియా బ్లాక్‌ నుంచి 11.9 శాతం మంది గెలుపొందారు. ఎన్డీఏ ఎంపీల్లో ఓబీసీలు 26.2 శాతం మంది ఉంటే ఇండియా బ్లాక్‌ ఎంపీలు 30.7 శాతం మంది ఉన్నారు. ఎన్డీఏ ఎంపీల్లో ఎస్సీలు 13.3 శాతం, ఎస్టీలు 10.8 శాతం మంది ఉండగా ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులకు ప్రాతినిధ్యం లేదు. అదే ఇండియా బ్లాక్‌లో ఎస్సీలు 17.8 శాతం, ఎస్టీలు 9.9 శాతం, ముస్లింలు 7.9 శాతం, క్రైస్తవులు 3.5 శాతం, సిక్కులు 5 శాతం ఉన్నారు.

Spread the love