వెనుబడిన ముస్లింలకు రిజర్వేషన్లా?

Reservation for backward Muslims?– బీజేపీ ఆక్రోశం
– మైనారిటీలను బుజ్జగించేందుకేనని వితండవాదం
పాట్నా : బీహార్‌లో నివసిస్తున్న ముస్లింలలో సుమారు 73% మందిని ‘వెనుకబడిన తరగతి’గా కులగణన వర్గీకరించింది. ముస్లింలలో బాగా వెనుకబడిన వారిని పస్మందాలు అంటారు. ఈ వర్గీకరణతో వారికి రిజర్వేషన్‌ ప్రయోజనాలు లభిస్తాయి. అయితే దీనిపై బీజేపీ పెద్ద రాద్ధాంతమే చేస్తోంది. బీహార్‌లో ఉన్నత విద్యలో, ఉద్యోగాలలో ఈబీసీలకు లభిస్తున్న రిజర్వేషన్ల ప్రయోజనాలు ఇప్పుడు ముస్లింలు కూడా పొందుతారని ఆ పార్టీ అక్కసు వెళ్లగక్కుతోంది. రాష్ట్రంలోని ఆర్జేడీ, ఐక్య జనతాదళ్‌ సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలను బుజ్జగించేందుకే ఈ పని చేస్తోందని ఆక్రోశిస్తోంది. మరింతమంది ముస్లింలకు రిజర్వేషన్‌ ప్రయోజనాలు కల్పిస్తే హిందూ వెనుకబడిన కులాల వారికి అవి దక్కకుండా పోతాయని బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆరోపించారు.
బీహార్‌ జనాభాలో ముస్లింలు 17.7% మంది ఉన్నారు. వీరిలో ఈబీసీ, అగ్ర కుల ముస్లింలు కూడా ఉంటారు. బీహార్‌లో ప్రస్తుతం అమలు చేస్తున్న రిజర్వేషన్ల ప్రకారం ఈబీసీలకు 18%, ఓబీసీలకు 12%, ఎస్సీలకు 6%, ఎస్టీలకు 1%, ఓబీసీ మహిళలకు 3% కోటా వర్తిస్తోంది. ముస్లింలలో అత్యంత వెనుకబడిన వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితుల వాస్తవ సమాచారం వెల్లడైనప్పుడే రిజర్వేషన్‌ విధానాలు వారి జీవితాలపై ప్రభావం చూపుతాయా లేదా అనేది తెలుస్తుందని ఢిల్లీ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ తన్వీర్‌ ఐజాజ్‌ చెప్పారు. ఈ సమాచారం బీహార్‌ కులగణన రెండో భాగంలో ఉంది. దానిని ఇంకా విడుదల చేయలేదు. ఈ సర్వే నివేదిక వస్తే రాష్ట్రంలో ముస్లిం రాజకీయాలు మరోసారి ఊపందుకుంటాయని, ఇప్పటికైతే ప్రభుత్వ ప్రయోజనాలను అగ్రకులాలే సొంతం చేసుకుంటున్నాయని, అవి వెనుకబడిన తరగతులకు చెందిన చివరి వ్యక్తి వరకూ చేరడం లేదని ఐజాజ్‌ తెలిపారు.
‘కేంద్ర ప్రభుత్వ ఓబీసీల జాబితాలో కొన్ని ముస్లిం గ్రూపులు కూడా ఉన్నాయి. అయితే ఈ జాబితాలో ప్రాబల్యం కలిగిన యాదవులు, కుర్మీలు వంటి వారు కూడా ఉన్నారు. వారితో వెనుకబడిన ముస్లింలు పోటీ పడలేరు. అయితే బీహార్‌లో బాగా వెనుకబడిన ముస్లింలు ఈ ఓబీసీ గ్రూపులతో పోటీ పడడం లేదు. ఎందుకంటే వారు వేరే ఈబీసీ జాబితాలో ఉన్నారు’ పస్మందా ముస్లిం మహజ్‌ అధినేత అన్వర్‌ చెప్పారు. ఈ సంస్థ వెనుకబడిన ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలలో ఈబీసీలకు రిజర్వేషన్లు ఉండడంతో రాజకీయాలలో వారి ప్రాధాన్యం కూడా పెరిగిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈబీసీలకు రిజర్వేషన్లు వర్తింపజేయాలన్నదే తమ డిమాండ్‌ అని ఆయన అన్నారు.
ముస్లింలలో బాగా వెనుకబడిన వారిని దువ్వేందుకు ప్రధాని మోడీ ఇటీవల అనేక ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో వారిపై అపార సానుభూతి కురిపించారు. పస్మందాలు అనేక కష్టాలు అనుభవిస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాల పరిధిలోకి వెనుకబడిన ముస్లింలను తీసుకొచ్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు మోడీ వ్యాఖ్యలను సూచికగా భావించవచ్చు. మోడీ వ్యాఖ్యలపై అన్వర్‌ మండిపడుతూ ‘ఇస్లాంలో అస్పృశ్యత, కుల ఆధారిత విభజన లేవని ఇదే బీజేపీ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతోంది. ఇది రెండు నాల్కల ధోరణి కాదా?’ అని ప్రశ్నించారు.

Spread the love