మోడీని ఓడించి దేశాన్ని రక్షించడమే

– మా లక్ష్యం : లాలూ ప్రసాద్‌ యాదవ్‌
పాట్నా : ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఓడించి, దేశాన్ని రక్షించడమే మా ప్రధాన లక్ష్యమని బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్‌జెడి అధ్యక్షులు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మంగళవారం తెలిపారు. ‘బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ మధ్య ఎలాంటి సమస్య లేదు. తేజస్వీ యాదవ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారని నాకు తెలుసు. అయితే ఇక్కడ ముఖ్య విషయం తేజస్వీ ముఖ్యమంత్రి కావడం కాదు. కేంద్రం నుంచి బిజెపిని గద్దె దింపడం, 2024 ఎన్నికల్లో బిజెపిని ఓడించడం’ అని లాలూ తెలిపారు. రాజ్యాంగాన్ని నిర్మూలించడానికి ప్రధానమంత్రి మోడీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయన్ని ఓడిస్తేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నట్లని లాలూ అన్నారు.
‘మోడీ మాట్లాడే విధానం చూస్తుంటే ఆయన సృహ కోల్పోయినట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది కూడా ఎర్రకోటపై జెండా ఆవిష్కరిస్తానని చెప్పుకునే ప్రధాని ఎప్పుడూ చూడలేదు’ అని అన్నారు. మోడీ మళ్లీ ప్రధానమంత్రయ్యే ప్రశ్నే లేదు, మోడీకి ఓట్లు పడవని చెప్పారు. సుమారు ఏడేళ్ల విరామం తరువాత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తన భార్య రబ్రీదేవితో కలిసి తన పూర్వీకుల గ్రామం పుల్వారియాను సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో లాలూ మాట్లాడారు. ఇండియా కూటమి కన్వీనర్‌గా నితీష్‌కుమార్‌ను నియమించే ప్రతిపాదన గురించి ప్రశ్నించగా.. ఆ పదవీలో ఎవ్వరైనా ఉండవచ్చనని లాలూ సమాధానం ఇచ్చారు.

Spread the love