– దళిత వర్గాలకు అన్యాయం :డీవైఎఫ్‌ఐ యువ దళిత సదస్సులో యూజీసీ మాజీ చైర్మెన్ సుఖదేవ్ థోరాట్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో రిజర్వేషన్లు ప్రమాదంలో పడ్డాయని, దళిత వర్గాలకు అన్యాయం యూజీసీ మాజీ చైర్మెన్ సుఖదేవ్ థోరాట్ విమర్శించారు. డీవైఎఫ్‌ఐ అఖిల భారత కమిటీ ఆధ్వర్యంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆదివారం పంజాబ్‌లోని చండీగఢ్ లో బాబా సోహన్ సింగ్ భక్న భవన్ లో జరిగిన దళిత యువ జాతీయ సదస్సులో సుఖదేవ్ థోరాట్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో దళిత వర్గాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. రిజర్వేషన్లు ప్రమాదంలో పడ్డాయని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఇటీవలి యూజీసీ ఎస్సీ, ఎస్టీ రిజర్డ్వ్ పోస్టులు భర్తీకాకపోతే, వాటిని జనరల్ కేటగిరీలో కలిపివేయాలని నిర్ణయం తీసుకుందని విమర్శించారు. దీనిపై ప్రతిఘటన రావడంతో వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. మోడీ అనుసరిస్తూ మనువాద చర్యలు దళిత వర్గాలకు నష్టం చేస్తాయని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం వంటి విధానాలతో దళిత విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని, దీన్ని తిప్పికొట్టాలని పిలుపు ఇచ్చారు. ఉపాధి రంగంలో కూడా దళితులకు ఆశించిన అవకాశాలు లేవని అన్నారు. వీటన్నింటి డీవైఎఫ్‌ఐ తిప్పికొట్టాలని పిలుపు ఇచ్చారు. డీవైఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ ఎ రహీం, హీమెగ్నా రాజ్ భట్టాచార్య, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సహయ కార్యదర్శి విక్రమ్ సింగ్ తదితరులు పాల్గొని మాట్లాడారు. మోడీ పాలనలో దళిత యువకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిందని, దళిత యువతలో అది మరింత పెరిగిందని అన్నారు. ఇప్పటికి అనేక రూపాల్లో దళితుల పట్ల వివక్షత చూపుతున్నారని అన్నారు. అనేక రాష్ట్రాల్లో భౌతిక దాడులు చేసి హత్యలు చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ప్రతి 18 నిమిషాలకు ఒక దాడి జరుగుతోందని పేర్కొన్నారు. ప్రతి వారానికి ఆరుగురు హత్యకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రోజూ ముగ్గురు దళిత మహిళలు హత్యచారానికి గురవుతున్నారని అన్నారు. రోజుకు 27 చోట్ల దళితులపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. దళిత యువతకు డీవైఎఫ్‌ఐ అండగా ఉంటుందని తెలిపారు. ప్రతి రాష్ట్రంలో టీం ఏర్పాటుచేయాలని, దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి చర్చల్లో పాల్గొన్న డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న మాట్లాడుతూ దేశంలో మోడీ అధికారంలోకి వచ్చాక, మనువాద గుండాలు పెట్రేగి పోతున్నారని అన్నారు. మోడీ ప్రభుత్వాన్ని దళిత యువత ఓడించడంతోపాటు దళితుల పట్ల వివక్ష వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేయాలని తీర్మానాన్ని డీవైఎఫ్‌ఐ అఖిల భారత ఉపాధ్యక్షులు జాక్ సీ థామస్ పెట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రతినిధులు తిరుపతి,కృష్ణ వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ,ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు రమణ, బాబు, పిచ్చయ్య, పాల్గొన్నారు.