రేవంతన్నా.. ఆ ఉత్తర్వుల సంగతేంటి?

Revantanna.. what about those orders?– తక్షణమే జీవో 5 ఉపసంహరించుకోవాలి
– కార్మిక హక్కులను హరించొద్దు..
– లేబర్‌ కోడ్‌లలో భాగమే ఆ జీవో
– గత ప్రభుత్వ తోవలో నడవొద్దు : ధర్నాలో కార్మిక సంఘాల నేతలు
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌ డిమాండ్‌
‘రేవంతన్నా..తక్షణమే జీవో 5ను ఉపసంహరించుకుంటున్మామని ఆదేశాలు ఇవ్వండి.. దాని సంగతేందో పరిశీలించండి, కార్మిక హక్కులను హరించొద్దు..గత ప్రభుత్వ తోవలో నడవొద్దు..ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయండి. అధికారంలోకి రాగానే కార్పొరేట్ల ప్రయోజనాలకు అనుగుణంగా జీవోలు విడుదల చేస్తే ఎలా? లేబర్‌ కోడ్‌ల విషయంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వ వైఖరినే అనుసరిస్తారా? ప్రజాపాలనలో ఐటీ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు కూడా భాగమే.. అందుకే తక్షణం ఆ జీవోను రద్దు చేయాలి’ అని కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని కార్మిక శాఖ (అంజయ్య భవన్‌) కార్యాలయం ముందు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించారు. ‘ఐటీ, ఐటీఈఎస్‌ పరిశ్రమలకు కార్మిక చట్టాలను మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 5ను తక్షణమే ఉపసంహరించుకోవాలి. కార్మిక హక్కులను కాలరాస్తే ఖబడ్దార్‌, వురు వాంట్‌ జస్టిస్‌’ అంటూ కార్మికులు నినదించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ రమ, హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బరామారావు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎంకె బోస్‌, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కిషన్‌ ప్రసంగించారు.
ఎస్వీ రమ మాట్లాడుతూ ఐటీ పరిశ్రమలకు కార్మిక చట్టాలను సడలిస్తూ జీవోను విడుదల చేయటమంటే వారితో వెట్టి చాకిరీ చేయించాలని నిర్ణయించటమేనని చెప్పారు. ఆ జీవో ప్రకారం మహిళా ఉద్యోగులకు భద్రత ఉంటుందా? అని ప్రశ్నించారు. ప్రజాపాలనలో కార్మికుల సంక్షేమం, మెరుగైన జీవితం, కార్మిక హక్కులకు భంగం వాటిల్లకుండా కాపాడాలని ఆకాంక్షించారు. కానీ.. తిరోగమన ఆలోచనలతో గత ప్రభుత్వ తోవలో నడిస్తే ఎలా? అని ప్రశ్నించారు. పని ప్రదేశంలో భద్రత, పని వేళలు, రవాణా సౌకర్యం, వేతనాలకు సంబంధించిన కొన్ని షరతులను అమలు చేయాలనే నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వటం సరికాదన్నారు. అనేక సంవత్సరాలుగా ఐటీ పరిశ్రమలను, కంపెనీలను కార్మిక శాఖ తనిఖీలు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి షిప్టుల కారణంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల ప్రయోజనాలను కార్పొరేట్లకు తాకట్టు పెట్టొద్దని సూచించారు. రామారావు మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్నారు. బోస్‌ మాట్లాడుతూ కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సూర్యం మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రభుత్వ తోవలోనే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నదని విమర్శించారు. లేబర్‌ కోడ్లలో అంతర్భాగమే జీవో 5 అని చెప్పారు. ధర్నా అనంతరం కార్మిక సంఘాల ప్రతినిధి బృందం కార్మిక శాఖ అదనపు కమిషనర్‌ డాక్టర్‌ గంగాధర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో సీఐటీయా రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర ఆఫీస్‌ బేరర్స్‌ ఎం పద్మశ్రీ, కూరపాటి రమేష్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు పి శ్రీకాంత్‌, పి సుధాకర్‌, వై సోమన్న, ఎ సునీత, హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర నాయకులు అంజాద్‌, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వివి రత్నాకర్‌, ఐఎఫ్‌టీయూ నాయకులు ప్రవీణ్‌, సీఐటీయూ నాయకులు ఆశోక్‌, శ్రీనివాస్‌, గణేశ్‌, ఎం శ్రావణ్‌కుమార్‌, మీనా తదితరులు పాల్గొన్నారు.

Spread the love