నవతెలంగాణ-లోకేశ్వరం
ఎడతెరిపి లేకుండా వారం రోజులుగా కురుస్తున్న వర్షంతో మండలంలోని రోడ్లు మొత్తం అధ్వానంగా మారాయి. మండల కేంద్రంలోని మన్మధ్ గ్రామం నుంచి హవర్గా ఎక్స్ రోడ్డు వరకు వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి, వర్షాలకు నీరు ఆ గుంతల్లో చేరడంతో దాదాపు 5 కిలోమీటర్ల రోడ్డు మొత్తం చెరువును తలపిస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం ఆ రోడ్డు గుండా వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటారు. తరుచూ వాహనాలు మరమ్మతులు చేయించాల్సి వస్తుందని అన్నారు. ఇలా ఆర్థికంగా నష్టపోవడంతో పాటు అనారోగ్యాల బారిన పడుతున్నామని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు స్పందించి, రోడ్డు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.