– నేడు బీసీసీఐ ప్రత్యేక సర్వ సభ్య సమావేశం
ముంబయి : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో చిన్న రాష్ట్రాల క్రికెట్ సంఘాల ప్రతినిధులకు ఆఫీస్‌బేరర్లుగా అవకాశాలు లభించటం శుభ సూచకం. ఇటీవల అస్సాం క్రికెట్ సంఘం నుంచి దేవజిత్ సైకియా బీసీసీఐ కార్యదర్శి పదవి చేపట్టగా.. చత్తీస్‌గఢ్ రాష్ట్ర క్రికెట్ సంఘం నుంచి ప్రభుతేజ్ సింగ్ భాటియా కోశాధికారిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. సాధారణంగా మహారాష్ట్ర, న్యూఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర క్రికెట్ సంఘాలు బీసీసీఐలో అధికారంలో చెలాయించటం పరిపాటి. జై షా ఐసీసీ చైర్మన్‌గా వెళ్లిన తర్వాత.. బీసీసీఐలో రాజకీయం సరికొత్తగా సాగుతుంది. తాజాగా గోవా క్రికెట్ సంఘం కార్యదర్శి రోహన్ దేశారు బీసీసీఐ సంయుక్త కార్యదర్శిగా ఎన్నిక కానున్నాడు. తొలుత సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన దేవజిత్ సైకియా.. ఇటీవల కార్యదర్శిగా ఎన్నికవటంతో జాయింట్ సెక్రటరీ పదవికి ఖాళీ ఏర్పడింది. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో నేడు బోర్డు ప్రత్యేక సర్వ సభ్య సమావేశం జరుగనుంది. ఎస్‌జీఎంకు బీసీసీఐ అనుబంధ సంఘాల (35) ప్రతినిధులు హాజరు కానున్నారు. సంయుక్త కార్యదర్శి పదవికి రోహన్ దేశారు ఒక్కరే పోటీలో ఉన్నారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. గత ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టుకు రోహన్ దేశారు టీమ్ మేనేజర్‌గా వ్యవహరించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు, ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) కార్యదర్శి సాన సతీశ్ బాబు నేడు ఎస్‌జీఎంకు హాజరు కానున్నారు.