Wednesday, April 29, 2026
E-PAPER
Homeఆటలురాయల్‌ విక్టరీ

రాయల్‌ విక్టరీ

- Advertisement -

పంజాబ్‌పై 6 వికెట్లతో రాజస్తాన్‌ గెలుపు
ఛేదనలో యశస్వి, వైభవ్‌, ఫెరీరా దూకుడు
పంజాబ్‌ 222/4, రాజస్తాన్‌ 228/4

నవతెలంగాణ-ముల్లాన్‌పూర్‌
పంజాబ్‌ కింగ్స్‌కు చుక్కెదురు. ఐపీఎల్‌19లో ఓటమెరుగని ప్రస్తానం, 264 పరుగుల లక్ష్యాన్ని ఊదేస్తూ ప్రత్యర్థులకు సవాల్‌ విసిరిన శ్రేయస్‌ అయ్యర్‌ సేనకు రాజస్తాన్‌ రాయల్స్‌ ఝలక్‌ ఇచ్చింది. 223 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన రాజస్తాన్‌ రాయల్స్‌ 6 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. పంజాబ్‌ కింగ్స్‌కు ఈ సీజన్లో ఇదే తొలి ఓటమి. ఛేదనలో రాయల్స్‌ ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (51, 27 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), వైభవ్‌ సూర్యవంశీ (43, 16 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అదరగొట్టారు. ఐదు సిక్సర్లు, మూడు ఫోర్లతో పవర్‌ప్లేలో సూర్యవంశీ చెలరేగగా.. ఆ తర్వాత యశస్వి జైస్వాల్‌ దంచికొట్టాడు. ధ్రువ్‌ జురెల్‌ (16) నిరాశపరిచినా.. రియాన్‌ పరాగ్‌ (29) ఆకట్టుకున్నాడు. డొనొవన్‌ ఫెరీరా (52 నాటౌట్‌, 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), శుభమ్‌ దూబె (31 నాటౌట్‌, 12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఐదో వికెట్‌కు అజేయంగా 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఫెరీరా, దూబె దూకుడుతో మరో 4 బంతులు ఉండగానే రాజస్తాన్‌ రాయల్స్‌ గెలుపు గీతను దాటింది. ఛేదనలో అజేయ అర్థ సెంచరీ సాధించిన ఫెరీరా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. పంజాబ్‌కింగ్స్‌ స్పిన్నర్‌ యుజ్వెంద్ర చాహల్‌ (3/36) మూడు వికెట్లతో మాయజాలం చేసినా.. రాయల్స్‌ విజయాన్ని అడ్డుకోలేకపోయాడు.

రాణించిన స్టోయినిస్‌, ప్రభుసిమ్రన్‌
తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 222 పరుగులు చేసింది. ఓపెనర్‌ ప్రభుసిమ్రన్‌ సింగ్‌ (59, 44 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచరీతో ఫామ్‌ కొనసాగించాడు. ప్రియాన్షు ఆర్య (29), కూపర్‌ కొనొలి (30), శ్రేయస్‌ అయ్యర్‌ (30) మంచి ఆరంభాలను సాధించినా.. ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. అయ్యర్‌ ఎదురుదాడి చేసేందుకు కాస్త ఇబ్బంది పడ్డాడు. మార్కస్‌ స్టోయినిస్‌ (62 నాటౌట్‌, 22 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) విధ్వంసక అర్థ సెంచరీతో చెలరేగాడు. దీంతో పంజాబ్‌ కింగ్స్‌ భారీ స్కోరు చేసింది. రాయల్స్‌ బౌలర్లలో యశ్‌ రాజ్‌ (2/41) రెండు వికెట్లు పడగొట్టాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -