సెన్సెక్స్ 417 పాయింట్ల పతనం..రూపాయిపైనా ఒత్తిడి
ముంబయి : అమెరికా సామ్రాజ్యవాదంతో అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా చమురు ధరల భయాలు మార్కెట్లను, రూపాయిని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. మంగళవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 417 పాయింట్లు లేదా 0.54 శాతం పతనమై 76,886.91కు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 97 పాయింట్లు 0.4 శాతం క్షీణించి కీలకమైన 24,000 మార్కు దిగువన 23,995.70కు పరిమితమయ్యింది. చమురు ధరల ఒత్తిడి, నెల చివరిలో అమెరికన్ డాలర్‌కు పెరిగిన డిమాండ్ కారణంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి 24 పైసలు తగ్గి 94.39 స్థాయికి చేరుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశంపై నెలకొన్న అనిశ్చితి మార్కెట్లను దెబ్బతీసింది. ఇరాన్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందం పట్ల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అసంతృప్తిగా ఉన్నారన్న వార్తలతో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. హార్ముజ్ జలసంధి ద్వారా సరఫరా నిలిచిపోవడంతో బ్రెంట్ క్రూడ్ ధర 2.78 శాతం పెరిగి బ్యారెల్‌కు 111.24 డాలర్లకు చేరుకుంది. బ్యాంకింగ్ రంగ షేర్లు ఈరోజు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ బ్యాంక్ సూచీలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్, నిఫ్టీ మెటల్ రంగాలు కొంత మద్దతును పొందాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 0.28 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.42 శాతం చొప్పున లాభపడ్డాయి. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం సద్దుమణిగి, చమురు సరఫరా పునరుద్ధరణ జరిగే వరకు మార్కెట్లలో ఇదే తరహా అనిశ్చితి కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మార్కెట్లకు చమురు భయాలు
- Advertisement -
- Advertisement -



