అటవీ, పర్యావరణ అనుమతులపై నిర్లక్ష్యం వద్దు
మిడ్ మానేర్ ఎడమ కాలువ
పనుల పునః ప్రారంభం : నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, పునరావసం కోసం రూ.5 వేల కోట్లు మంజూరు చేశామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. నిధుల కొరత కారణంగా సాగునీటి పనులు ఆగొద్దని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని బీర్.అంబేడ్కర్ సచివాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, డి. శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఇందులో ఇప్పటికే రూ.2 వేల కోట్లు విడుదలయ్యాయనీ, మిగిలిన రూ.3 వేల కోట్లు ప్రాధాన్యతా క్రమంలో విడుదల చేస్తామని చెప్పారు. నిధుల కొరత కారణంగా చివరి దశలో ఉన్న ఏ సాగునీటి ప్రాజెక్టు కూడా నిలిచిపోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్, అటవీ, పర్యావరణ అనుమతులను అత్యంత ప్రాధాన్య అంశాలుగా తీసుకోవాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టుల వారీగా ఎన్ని నిధులు అవసరమో వెంటనే ప్రతిపాదనలు పంపాలనీ, అవసరమైన ఆర్థిక అనుమతులు, టోకెన్లు పొందడంలో జాప్యం చేయవద్దని సూచించారు. నాలుగున్నరేండ్లుగా నిలిచిపోయిన మిడ్‌మానేరు ఎడమ కాలువ మిగులు పనులను తక్షణమే పునఃప్రారంభించాలని మంత్రి ఆదేశించారు.
సవరించిన అంచనాలు సిద్ధం చేయడం, భూసేకరణ, టెండర్ల ప్రక్రియ, చట్టబద్ధ అనుమతుల సాధన… ఒకదాని తర్వాత మరొకటి కాకుండా సమాంతరంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ప్రతిపాదించిన లక్ష్మీనరసింహస్వామి పత్తిపాక రిజర్వాయర్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. ఈ పథకం ద్వారా కొత్తగా 10 వేల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు కాకతీయ ప్రధాన కాలువలో డి-83 నుంచి డి-94 వరకు ఉన్న 2.40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. లైడార్ సర్వే, డేటా ప్రాసెసింగ్ ఇప్పటికే పూర్తయ్యాయనీ, బోర్‌హోల్ డ్రిల్లింగ్, ట్రయల్ పిట్స్, జియోటెక్నికల్ పరిశోధనలు కొనసాగుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. ఆగస్టు నెలాఖరులోగా డీపీఆర్ సమర్పిస్తామని తెలిపారు. సమీక్షలో ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన ప్రతి సమస్యను ‘యాక్షన్ పాయింట్’గా మార్చాలని, తదుపరి సమావేశం నాటికి వాటిపై తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని అధికారులకు సూచించారు.
రోళ్లవాగు 96 శాతం పూర్తి…..
జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టు పనులు 96 శాతం పూర్తయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు. ప్రస్తుతం ఉన్న 0.250 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని 0.949 టీఎంసీలకు పెంచి, స్థానిక పరీవాహక ప్రాంతం నుంచి లభించే నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా చివరి ఆయకట్టులోని దాదాపు 15 వేల ఎకరాలకు సాగునీటి భరోసా కల్పించడం ప్రాజెక్టు లక్ష్యమని పేర్కొన్నారు. సర్‌ప్లస్ వీర్, హెడ్ స్లూయిస్‌లతో సహా ప్రధాన నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయని తెలిపారు. బండ్-2లో కొంత భాగం అటవీ భూమిలో ఉండటంతో మిగిలిన పనులు అటవీ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయని చెప్పారు. సాంకేతికంగా ఉన్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి వెంటనే ప్రాజెక్టును వాడుకలో తీసుకు రావాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ సూచించారు. సమీక్షలో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లతో పాటు ఇంజినీర్-ఇన్-చీఫ్ ఓవి. రమేష్‌బాబు, నీటిపారుదల శాఖ జాయింట్ సెక్రెటరీ కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



