TSRTC: ఆర్టీసీ 100 రోజుల ‘గ్రాండ్‌ ఫెస్టివల్‌ ఛాలెంజ్‌’

RTC 'Grand Festival Challenge'నవతెలంగాణ – హైదరాబాద్‌: టీఎస్‌ఆర్టీసీ ప్రయాణం మరింతగా పెరగనుంది, ప్రయాణికులకు మరిన్ని బస్సు ట్రిప్పులు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బస్సులు సగటున రోజుకు 32.21 లక్షల కి.మీ. ప్రయాణిస్తున్నాయి. ఇక నుంచి రోజుకు మరో లక్ష కిలోమీటర్ల దూరం అదనంగా నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. బతుకమ్మ సంబరాలు, దసరా, దీపావళి, క్రిస్మస్‌, సంక్రాంతి ఇలా వరుస పండుగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలను దృష్టిలో పెట్టుకుని జనవరి 22 వరకు 100 రోజుల ‘గ్రాండ్‌ ఫెస్టివల్‌ ఛాలెంజ్‌’కు ఆదివారం శ్రీకారం చుట్టింది. ఈ సవాలును స్వీకరించాలంటూ సంస్థ ఎండీ సజ్జనార్‌.. డ్రైవర్లు, కండక్టర్లకు లేఖ రాశారు. రిటైర్మెంట్లే తప్ప నియామకాలు లేకపోవడంతో ఆర్టీసీలో సరిపడా డ్రైవర్లు, కండక్టర్లు లేరు. వారాంతపు సెలవుతో పాటు ఇతర సెలవులు వాడుకోవడం వల్ల సిబ్బంది కొరతతో బస్సుల్ని రద్దు చేయాల్సి వస్తోంది. ఫలితంగా సంస్థ ఆదాయాన్ని కూడా కోల్పోతుంది. ప్రస్తుతం పండుగల సమయం కావడంతో ఆర్టీసీ వ్యూహం మార్చింది. అదనపు కి.మీ. నడపడంతో పాటు సెలవులు, సీ ఆఫ్‌లు తీసుకోకుండా పనిచేస్తే సిబ్బందికి ‘క్యాష్‌ అవార్డు’లు ఇస్తామని ప్రకటించింది. తద్వారా ప్రతిరోజు అదనంగా రూ.1.64 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించాలని, 100 రోజుల గ్రాండ్‌ ఫెస్టివల్‌ ఛాలెంజ్‌తో రూ.164 కోట్ల అదనపు ఆదాయం రాబట్టాలని ఆర్టీసీ ప్రణాళిక రచించింది.

Spread the love