Monday, June 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండ్రైవర్ల ఉద్యోగ భద్రతకు ఆటంకంగా ఉన్న ఆర్టీసీ రెగ్యులేషన్స్ మార్చాలి

డ్రైవర్ల ఉద్యోగ భద్రతకు ఆటంకంగా ఉన్న ఆర్టీసీ రెగ్యులేషన్స్ మార్చాలి

- Advertisement -

మోటార్ వెహికల్ యాక్ట్-2019 సెక్షన్ 178(2) ప్రకారం 
టీమ్ డ్రైవర్లపై కేసులు రాయొద్దు : ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు, ప్రచార కార్యదర్శి పి. రవీందర్ రెడ్డి
స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్‌డబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో డ్రైవర్ల రాష్ట్ర సదస్సు

నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
రాష్ట్రప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ పూర్తికాకముందే డ్రైవర్, కండక్టర్లకు ఉద్యోగ భద్రతను కల్పించడంతోపాటు సర్వీస్ కండిషన్లను మెరుగుపరచాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు, ప్రచార కార్యదర్శి పి. రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. టీజీఎస్‌ఆర్‌టీసీలో డ్రైవర్ల ఉద్యోగ భద్రత, పని పరిస్థితుల మెరుగుదలపై టీజీఎస్ ఆర్‌టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్‌డబ్ల్యూఎఫ్-సీఐటీయూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ జిల్లాలోని శంకర్ ప్రాంగణంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. సంఘం నాయకులు ఎల్లయ్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో వీఎస్ రావు మాట్లాడుతూ.. ఆర్టీసీలో డ్రైవర్లు రోజుకు 14 నుంచి 16 గంటల పాటు విపరీతమైన పనిభారంతో తీవ్ర మానసిక ఒత్తిడి మధ్య విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. డ్రైవర్ విధులతో పాటు బలవంతంగా డ్రైవర్ కం కండక్టర్ డ్యూటీలు చేయించడం వల్ల డ్రైవర్లు ‌మానసిక ఒత్తిడికి గురవడం, అనారోగ్యం బారిన పడటమే కాకుండా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. దాంతో వారి ఉద్యోగ భద్రత పెనంలోంచి పొయ్యిలో పడ్డట్లయిందని తెలిపారు. ఉద్యోగ భద్రతకు గొడ్డలిపెట్టుగా ఉన్న కాండక్ట్ రెగ్యులేషన్ 28(9) ఏ,బీలను తక్షణమే రద్దు చేసి, మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ 124, 172(2), 185లను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

దీనికనుగుణంగా ఉద్యోగ భద్రత కమిటీ సరైన గైడ్‌లైన్స్ విడుదల చేయాలన్నారు. బ్రీత్ అనలైజర్ టెస్టుల్లో ప్రభుత్వ ప్రమాణాలు పాటించాలని, దానికి భిన్నంగా ఉన్న 01/2015 సర్క్యులర్‌ను రద్దు చేయాలన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు యాజమాన్యమే బెయిల్ ఇప్పించడంతోపాటు డ్రైవర్ తరఫున లాయర్‌ను పెట్టాలని, కోర్టుకు హాజరైనప్పుడు ‘ఆన్ డ్యూటీ’ సౌకర్యం కల్పించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ప్రయివేట్ విద్యుత్ బస్సుల వల్ల ఆర్టీసీ ఆర్థికంగా నష్టపోతోందని, డ్రైవర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే విద్యుత్ బస్సులను ఆర్టీసీకే కేటాయించాలన్నారు. రిటైర్డ్ కార్మికులకు చెల్లించాల్సిన 2017, 2021 ఆర్‌పీఎస్ బకాయిలను వెంటనే చెల్లించడానికి రోడ్ మ్యాప్ తయారు చేయాలని, రిటైర్డ్ కార్మికులకు కార్పొరేట్ వైద్య సదుపాయాన్ని రూ. 4 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పెంచుతూ ఇచ్చిన సర్క్యులర్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. విలీనం కన్నా ముందే కార్మికులకు చెల్లించాల్సిన సీసీఎస్, పీఎఫ్, ఎస్‌ఆర్‌బీఎస్, ఎస్బీటీ యాజమాన్య బకాయిలు రూ. 2100 కోట్లను తక్షణమే విడుదల చేయాలన్నారు. కేఎంపీఎల్ పేరిట డ్రైవర్లపై జరుగుతున్న వేధింపులను ఆపాలని, ‘మహాలక్ష్మి’ స్కీమ్ నేపథ్యంలో డ్రైవర్లపై జరుగుతున్న దాడుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఉద్యోగ భద్రతకు ఆటంకంగా మారిన ఆర్టీసీ రెగ్యులేషన్స్ మార్చాలని, సదస్సుకు హాజరైన డ్రైవర్లందరూ దీనిపై సరైన సూచనలు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సదస్సులో ఎస్‌డబ్ల్యూఎఫ్ ఉపాధ్యక్షులు సి.హెచ్. రామచందర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సదస్సులో ఎస్‌డబ్ల్యూఎఫ్ వ్యవస్థాపక రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ నాయకులు వి. రాములు, రాష్ట్ర కార్యదర్శి బతుల సుధాకర్, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, వరంగల్ రీజన్ కార్యదర్శి ఉపేంద్ర చారి, స్థానిక నాయకులు శ్రీనివాస్, రామారావు, ఐ. వెంకటేశ్వర్లు, సర్వయ్య, జె. కె. రావు, రవి, ఇంద్రయ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -