Monday, June 22, 2026
E-PAPER
Homeక్రైమ్కన్న కొడుకులకు విషమిచ్చి దారుణం ఇద్దరు చిన్నారులు మృతి

కన్న కొడుకులకు విషమిచ్చి దారుణం ఇద్దరు చిన్నారులు మృతి

- Advertisement -

తల్లి పరిస్థితి విషమం 
ఖమ్మం త్రీటౌన్ పరిధిలో ఘటన
నవతెలంగాణ – ఖమ్మం

భార్యాభర్తల మధ్య తలెత్తిన కుటుంబ వివాదం ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలితీసుకున్న విషాద ఘటన ఖమ్మం నగరంలో కలకలం రేపింది. బిస్కెట్లలో ఎలుకల మందు కలిపి కన్న కొడుకులకు ఇచ్చి, ఆపై తాను కూడా విషం సేవించిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏదులాపురం మున్సిపాలిటీ 7వ వార్డు గుర్రాలపాడు గ్రామానికి చెందిన బొబ్బల లింగరాజు, స్వాతి దంపతులు కుటుంబ అవసరాల రీత్యా ఖమ్మం త్రీటౌన్ పరిధిలోని గాంధీనగర్‌లో నివసిస్తున్నారు. లింగరాజు స్థానికంగా ఓ సెల్‌ఫోన్ షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల షాప్ యజమాని ఆర్థిక ఇబ్బందుల కారణంగా దుకాణం కొనసాగించలేనని చెప్పడంతో స్వగ్రామానికి తిరిగి వెళ్లి అక్కడ జీవనోపాధి చూసుకోవాలని లింగరాజు భార్యను కోరాడు. అయితే స్వాతి ఖమ్మంలోనే ఉండాలనే పట్టుదలతో నిరాకరించడంతో ఇద్దరి మధ్య గత రెండు రోజులుగా తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి.

ఈ క్రమంలో భర్త.. తన మాట వినలేదన్న కోపంతో స్వాతి ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్నారులకు బిస్కెట్లలో ఎలుకల మందు కలిపి శనివారం రాత్రి ఇచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం తాను కూడా విషం సేవించినట్టు సమాచారం. ఆ తర్వాత భర్తకు ఫోన్ చేసి పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పడంతో, అతను హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వచ్చిన లింగరాజు చిన్నారులకు సిరప్ ఇచ్చి పడుకోబెట్టినట్టు తెలుస్తోంది. పరిస్థితి విషమించడంతో స్వాతిని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. విష ప్రభావంతో పెద్ద కుమారుడు వేదక్ కుమార్ రాత్రి నిద్రలోనే మృతి చెందగా, చిన్న కుమారుడు తనీష్ తీవ్ర అస్వస్థతకు గురై ఖమ్మంలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం ఉదయం మృతిచెందాడు. తల్లి స్వాతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. కన్నబిడ్డలను కోల్పోయిన తండ్రి లింగరాజు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతం శోకసంద్రంగా మారింది. సమాచారం అందుకున్న ఖమ్మం త్రీటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను ఏదులాపురం మున్సిపాల్టీ చైర్‌‌పర్సన్‌ ‌పి.అనిత సందర్శించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -