Monday, June 22, 2026
E-PAPER
Homeక్రైమ్రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

- Advertisement -

భద్రాద్రిలో చెట్టును ఢీకొన్న కారు
ముగ్గురు దుర్మరణం
సిద్దిపేటలో 
దంపతులు మృతి


నవతెలంగాణ-ములకలపల్లి/ కొండపాక

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాదారం అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలం వెంకటేశ్వర కాలనీకి చెందిన దూడల సాయి ప్రకాష్ (28), ఆయన భార్య సంధ్య (26), కుమారుడు మోక్షిత్ (4), తల్లి జ్యోతి కలిసి ఆదివారం ఉదయం ములకలపల్లిలో నివసిస్తున్న బంధువు దూడల రాము ఇంటికి వచ్చారు. మధ్యాహ్నం భోజనం అనంతరం భద్రాచలం వెళ్లేందుకు కారులో బయలుదేరారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మాదారం అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు సాయి ప్రకాష్, సంధ్య, మోక్షిత్ తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే మృతిచెందారు. జ్యోతికి కాలు విరగడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ మధు ప్రసాద్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ‌మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో భద్రాచలం, ములకలపల్లి ప్రాంతాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల పరిధిలోనిలకుడారం గ్రామ శివారులోని రాజీవ్ రహదారిపై ముందు వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్‌లు వేయడంతో వెనకనే ఉన్న బైక్ ఆ ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది. దాంతో బైక్‌పై ఉన్న దంపతులిద్దరూ మృతి చెందారు. కుకునూరుపల్లి ఎస్‌ఐ బాల‌కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన చందనగిరి మహేందర్, దీక్ష దంపతులు హైదరాబాద్‌లో ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నారు. ఆదివారం ఉదయం వారు బైక్‌పై హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో రాజీవ్ రహదారి కుకునూరుపల్లి గ్రామ శివారులోకి రాగానే వారి ముందు నుంచి వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వారి వాహనం ట్రాక్టర్‌ను ఢీకొని మహేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. అతని భార్యకు తీవ్ర గాయాలు కాగా గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందింది. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -