నవతెలంగాణ -హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు సర్వం సిద్ధమైంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభం కానుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కార్మిక సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఏప్రిల్ 22, బుధవారం మొదటి డ్యూటీ నుంచి బస్సులు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం నుంచి చర్చలకు అధికారిక ఆహ్వానం, డిమాండ్లపై స్పష్టమైన హామీ రాకపోవడంతో సమ్మెకే మొగ్గు చూపుతున్నట్లు ఆర్టీసీ ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ప్రకటించింది.
జేఏసీతో పాటు ఇతర కార్మిక సంఘాలు సైతం సమ్మెకు మద్దతు ఇవ్వడంతో ఆర్టీసీలోని దాదాపు అన్ని యూనియన్లు ఇందులో పాలుపంచుకోనున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం తన నివాసంలో ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది.


