సెమీస్‌లో సఫారీలు

సెమీస్‌లో సఫారీలు– దశాబ్దం నిరీక్షణకు తెరదించిన దక్షిణాఫ్రికా
– ఉత్కంఠ సూపర్‌8 పోరులో విండీస్‌పై గెలుపు
– ఐసీసీ 2024 టీ20 ప్రపంచకప్‌
నవతెలంగాణ-నార్త్‌సౌండ్‌
సఫారీలు సెమీఫైనల్లోకి ప్రవేశించారు. ఉత్కంఠ సూపర్‌8 గ్రూప్‌-2 మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించారు. బ్యాటింగ్‌కు కష్టమైన పిచ్‌పై ఛేదనలో ట్రిస్టన్‌ స్టబ్స్‌ (29, 27 బంతుల్లో 4 ఫోర్లు), హెన్రిచ్‌ క్లాసెన్‌ (22, 10 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), మార్కో జాన్సెన్‌ (21 నాటౌట్‌, 14 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) రాణించారు. 136 పరుగుల ఛేదనలో వర్షం అంతరాయంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం లక్ష్యాన్ని 17 ఓవర్లలో 123 పరుగులుగా నిర్దేశించారు. 16.1 ఓవర్లలోనే 124 పరుగులు సాధించిన దక్షిణాఫ్రికా మరో ఐదు బంతులు ఉండగానే లాంఛనం ముగించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. రోస్టన్‌ ఛేజ్‌ (52చ 42 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీ సాధించగా, ఓపెనర్‌ కైల్‌ మేయర్స్‌ (35, 34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకట్టుకునే ఇన్నింగ్స్‌ నమోదు చేశాడు. మూడు వికెట్లతో విజృంభించిన సఫారీ స్పిన్నర్‌ షంశి (3/27) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.
సఫారీ సూపర్‌ : ఛేదనలో సఫారీ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌ (12), రీజా హెండ్రిక్స్‌ (0) ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో వికెట్‌ కోల్పోయారు. 15/2తో కష్టాల్లో పడిన వేళ వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. విరామం అనంతరం మ్యాచ్‌ మొదలైనా.. లక్ష్యాన్ని 17 ఓవర్లకు 123 పరుగులకు మార్చారు. కెప్టెన్‌ ఎడెన్‌ మార్‌క్రామ్‌ (18, 15 బంతుల్లో 2 ఫోర్లు), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (29), హెన్రిచ్‌ క్లాసెన్‌ (22) మిడిల్‌ ఆర్డర్‌లో సమయోచిత ఇన్నింగ్స్‌లు ఆడారు. కానీ మిడిల్‌ ఆర్డర్‌తో పాటు డెవిడ్‌ మిల్లర్‌ (4) సైతం నిష్క్రమించటంతో 5/93తో దక్షిణాఫ్రికా చిక్కుల్లో పడింది. బంతితో పరుగు చేయాల్సిన తరుణంలో టెయిలెండర్లు ఒత్తిడిని జయించారు. మార్కో జాన్సెన్‌ (21 నాటౌట్‌), కగిసో రబాడ (5 నాటౌట్‌, 3 బంతుల్లో 1 ఫోర్‌) మెరిశారు. ఆఖరు ఓవర్‌ తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన జాన్సెన్‌.. సఫారీలను సెమీఫైనల్స్‌కు చేర్చాడు. వెస్టిండీస్‌ బౌలర్లలో స్పిన్నర్‌ రోస్టన్‌ ఛేజ్‌ (3/12), పేసర్లు రసెల్‌ (2/19), అల్జారీ జోసెఫ్‌ (2/25) రాణించారు.

Spread the love