సంఘ్ చేతిలో సైనిక్‌ స్కూళ్లు

Sainik schools in the hands of the Sangh– 62 శాతం కొత్త పాఠశాలలు ఆరెస్సెస్‌, బీజేపీ నేతలకు కేంద్రం అప్పగింత
– మోడీ సర్కారు తీరుపై విద్యావేత్తలు, మేధావుల ఆగ్రహం
న్యూఢిల్లీ : కొత్తగా ఏర్పాటు చేయబోయే సైనిక్‌ స్కూళ్లను కాషాయమయం చేసే యత్నాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. 62 శాతానికి పైగా పాఠశాలలను సంఫ్‌ బీజేపీ నేతలు, వారి మిత్రులకు అప్పగించింది. ది రిపోర్టర్స్‌ కలెక్టివ్‌ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. కేంద్రం 62 శాతం కొత్త సైనిక్‌ పాఠశాలలను సంఫ్‌ పరివార్‌, బీజేపీ రాజకీయ నాయకులు, మిత్రులకు అప్పగించింది. ”కేంద్ర ప్రభుత్వ పత్రికా ప్రకటనలు, సమాచార హక్కు (ఆర్టీఐ) ప్రత్యుత్తరాల నుంచి అందిన సమాచారం దీనిని తెలియజేస్తున్నది. ఇప్పటివరకు జరిగిన 40 సైనిక్‌ స్కూల్‌ ఒప్పందాలలో కనీసం 62 శాతం రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ (ఆరెస్సెస్‌)కు, దాని అనుబంధ సంస్థలు, బీజేపీ రాజకీయ నాయకులు, దాని రాజకీయ మిత్రులు, హిందుత్వ సంస్థలు, వ్యక్తులు, ఇతర హిందూ మత సంస్థలకు సంబంధించిన స్కూళ్లకు అప్పగించబడ్డాయి” అని కలెక్టివ్‌ వివరించింది. ప్రయివేటు వారిని ఎస్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం పొందేందుకు, పాక్షిక ఆర్థిక సహాయాన్ని అందుకునేందుకు, వారి శాఖలను నిర్వహించటానికి ప్రభుత్వం అనుమతించటం సైనిక్‌ స్కూల్‌ విద్యా వ్యవస్థ చరిత్రలో ఇదే మొదటిసారి అని కలెక్టివ్‌ పేర్కొన్నది.
2021లో భారత్‌లో సైనిక్‌ పాఠశాలలను నిర్వహించటానికి కేంద్రం ప్రయివేటువారికి తలుపులు తెరిచింది. వార్షిక బడ్జెట్‌లోనూ భారత్‌ అంతటా 100 కొత్త సైనిక్‌ పాఠశాలలను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈ విధంగా సైనిక్‌ స్కూళ్లను హేతుబద్దత లేకుండా బీజేపీ తన మాతృ సంస్థకు, తమ నాయకులకు అప్పగించటం ఏ మాత్రమూ శ్రేయస్కరం కాదని సామాజికవేత్తలు, విద్యా నిపుణులు అంటున్నారు. ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గి పారదర్శకతను పాటించాలని వారు సూచిస్తున్నారు.

Spread the love