మనుధర్మంపై సమధర్మ యుద్ధం సాగించాలి

KVPS– జాషువా సాహిత్యం సామాజికోద్యమాలకు స్ఫూర్తి : వక్తలు
– కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో జాషువా జయంతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
జాషువా సాహిత్యం సామాజికోద్యమాలకు స్ఫూర్తి అనీ, మను ధర్మంపై సమధర్మ యుద్ధం సాగించాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు, అంబేద్కరిస్టు డాక్టర్‌ స్వామి అల్వాల్‌, పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక అధికారి(రిటైర్డ్‌) ఇరిగి నరసింగరావు అన్నారు. జాషువా సాహిత్యం సామాజికోద్య మాలకు స్ఫూర్తి అని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో జాషువా 128వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..జాషువా సాహిత్య పిపాసి అనీ, గొప్ప మానవతావాది, సంస్కరణవాది అని కొనియాడారు. జాషువా తనకు పేదరికం, కులమత భేదాలు గురువులాంటివనీ, అందులో ఒకటి ప్రతిఘటన నేర్పితే రెండోది పరమత సహనాన్ని నేర్పిందని చెప్పిన విషయాలను గుర్తుచేశారు. విశ్వనాథ సత్యనారాయణ లాంటి కవులు తనపై విమర్శలు ఎక్కుపెడితే అంతే స్థాయిలో ఆయన తిప్పికొట్టిన సంఘటనలను వివరించారు. ఆరుగాలం కష్టం చేసే కష్టజీవులకు సమాజంలో భుక్తం కరువైందని జాషువా తన కవిత్వం ద్వారా ఆవేదన వ్యక్తం చేశారన్నారు. వెనుబడిన సామాజిక తరగతుల వారిని దేవుని గుడిలోకి రానివ్వనప్పుడు ‘గబ్బిలం’ ఖండకావ్యం రాసి గబ్బిలంతో దేవుడికి లేఖపంపిన మహనీయుడు జాషువా అని కొనియాడారు. ప్రతిమల పెండ్లీలకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న కోటీశ్వరులు కూటికి గతి లేని వారికి సహాయపడకపోవడం దారుణమన్నారు. నేటికీ సమాజంలో వివక్షా రూపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయన్నారు. ఆ అసమానతలను, అంతరాలను దేశం నుంచి తరిమేయడం కోసం నేటితరం జాషువా స్ఫూర్తితో ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేవీపీఎస్‌ నాయకులు గోవర్ధన్‌, సురేష్‌, శ్రీను పాల్గొన్నారు.

Spread the love