పారిశుధ్య కార్మికులకు రూ.21వేల వేతనం ఇవ్వాలి

– అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలి
– సీఐటీయూ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు అశోక్‌
– కలెక్టరేట్‌ ఎదుట ధర్నా, అదనపు కలెక్టర్‌కు వినతి
నవతెలంగాణ-సిటీబ్యూరో
కాంట్రాక్ట్‌ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని, పారిశుధ్య కార్మికులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెల్లిస్తున్నట్టుగా తెలంగాణలోనూ రూ.21వేల వేతనం అమలు చేయాలని సీఐటీయూ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు అశోక్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట తెలంగాణ మున్సిపల్‌ కార్మికుల యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌, ఎన్‌ఎంఆర్‌, ఫిక్స్‌డ్‌ పే తదితర పద్ధతుల్లో పని చేస్తున్న కార్మికులు ప్రజల ఆరోగ్యం పట్ల నిరంతరం శ్రమిస్తున్నా అడుగడుగునా వివక్షతకు గురవుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జీఓ 60ని విడుదల చేసి కేటగిరీల వారీగా వేతనాలను రూ.15,600, రూ.19,600, రూ.22,750 లుగా నిర్ణయించిందని తెలిపారు. వివిధ కేటగిరీలకు వేతనాలు అమలు చేయకుండా గంపగుత్తగా అందరికీ ఒకే వేతనాన్ని వర్తింపజేస్తూ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. దీంతో మున్సిపాల్టీల్లో పని చేస్తున్న పబ్లిక్‌, నాన్‌ పబ్లిక్‌ కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. జీఓ 970ని సవరణలు చేసి జీఓఆర్‌ టినెం.1037ను విడుదల చేసి జీఓ నెం.60, జీఓ నెం.63లలో నిర్ణయించిన విధంగా కేటగిరీల వారీగా వేతనాలను అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. సవరణ చేసి జీఓఆర్‌ నెం.1037ను విడుదల చేసినప్పటికీ మున్సిపాల్టీల్లో కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ సేవలను థర్డ్‌ పార్టీకి అప్పజెప్పాలని, ప్రతి ఏడాదీ ఈ సేవలను రెన్యువల్‌ చేసుకోవాలని ఆ జీఓలో పేర్కొన్నారని తెలిపారు. ఈ పనులను ఎంపిక చేసిన కాంట్రాక్ట్‌ ఏజెన్సీలకు ఇవ్వాలని నిర్ణయించారని, దీనివల్ల గతంలో అమలు జరిగిన మళ్ళీ కాంట్రాక్ట్‌ దందా ప్రారంభమవుతుందని, దీంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతారని, ప్రభుత్వ ఖజానాకు నష్టం జరుగుతుందని తెలిపారు. వివిధ మున్సిపాల్టీల్లో పన్నులు వసూలు చేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ బిల్‌ కలెక్టర్లు, వార్డ్‌ ఆఫీసర్స్‌ నుండి పన్నులు వసూలు చేసే బాధ్యతలను తీసివేసి ఆ పనులను ఇతరులకు అప్పజెప్పారన్నారు. దీంతో వారికి ఉపాధి లేకుండా పోయిందని, వీరికి ప్రత్యామ్నాయ డ్యూటీలు ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని కోరారు.
గత ప్రభుత్వం ఆదేశాల ప్రకారం అనారోగ్యాలకు గురైన, పని చేయలేని స్థితిలో ఉన్న మున్సిపల్‌ కార్మికుని కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, నూతన పీఆర్సీలో కనీస వేతనం రూ.26వేలు నిర్ణయించాలని, మున్సిపల్‌ సిబ్బంది అందరినీ పర్మినెంట్‌ చేయాలని, ఆంధ్రప్రదేశ్‌లో పారిశుధ్య కార్మికులకు చెల్లిస్తున్న రూ.21వేల వేతనం మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని, కేటగిరీల వారీగా వేతనాలు అమలు చేయాలని కోరారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్‌.శ్రీనివాస్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులకి ఇన్సూరెన్స్‌ కల్పించాలని, కార్మికులు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకోవాలనీ, సుబ్బు, నేను, ఇవ్వాలని, అధికారులు వేధింపులు అరికట్టాలని డిమాండ్‌ చేశారు. జిల్లా సహాయ కార్యదర్శి లింగస్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్మికులందరినీ పర్మనెంట్‌ చేస్తామని, ఔట్సోర్సింగ్‌ విధానం రద్దు చేస్తామని చెప్పి పదేండ్లు మున్సిపల్‌ కార్మికుల గురించి పట్టించుకోవడంలేదని గుర్తు చేశారు. ఈ ధర్నాలో మున్సిపల్‌ యూనియన్‌ జిల్లా నాయకుడు ఎం.సత్యనారాయణ అధ్యక్షత వహించగా.. సీఐటీయూ జిల్లా కోశాధికారి ఉన్నికృష్ణన్‌, ఫిర్యాదిగూడ మున్సిపల్‌ నాయకుడు సోమయ్య, స్వప్న, తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాల నరసింహ, ఎల్లయ్య, సూరి, పెన్టేశ్‌, మహేశ్‌, సురేష్‌ మధు,పాల్గొన్నారు.

Spread the love