సంక్రాంతి కోఢీ సై..!

Sankranti kodhi sai..!– హద్దులు దాటుతున్న పందెం కోళ్లు
– కోర్టులు వద్దన్నా…పోలీసులు అడ్డుకున్నా ఆగని పందేలు
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
సంక్రాంతి అంటే బోగి మంటలు, ముగ్గులు, వివిధ రకాల వంటకాలే కాదు. కోడి పందేలూ ప్రధానభాగమయ్యాయి. ఏటా మాదిరిగానే ఈ సారి కూడా కోడి పందేల జోరు ఊపందుకుంది. బోగి రోజే కోడి పందేలు షురూ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు సరిహద్దు ప్రాంతాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిలాల నుంచి కూడా కోడి పందేలకు హాజరవుతున్నారు. చంకన పుంజులు పెట్టుకుని పందెం రాయుళ్ల పరుగులు పెడుతున్నారు. కోర్టులు వద్దన్నా…నిషేధాజ్ఞలు ఉన్నా…పోలీసులు అడ్డుకున్నా కోడి పందేలు జోరు ఆగడం లేదు. ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బరుల్లో పుంజులు బరిలోకి దిగుతూనే ఉన్నాయి. కత్తులు కట్టి కొందరు…కత్తులు లేకుండా మరికొందరు పందేలు వేస్తున్నారు. అడ్డంకులెన్నున్నా అధిగమించి పామాయిల్‌, జీడిమామిడి తోటల్లో పందేలు నిర్వహిస్తున్నారు. పోలీసుల కంటపడకుండా గుట్టుచప్పుడు పనికానిస్తున్నారు.
ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి కోడి పందేలకు సంపన్నుల పిల్లలు, పలువురు రాజకీయ, వాణిజ్య ప్రముఖులు సైతం కార్లలో వెళ్లి మరీ చేతి చమురు వదిలించుకుంటుండటం గమనార్హం. కోట్లలోనే ఈ పందేలు సాగుతున్నాయి. ఒకప్పుడు దసరా నుంచి సంక్రాంతి వరకు కొనసాగిన కోడిపందేలను కోర్టులు, ప్రభుత్వాలు నియంత్రించడంతో ప్రస్తుతం చాలావరకు తగ్గాయి.
బరుల్లోకి దిగేందుకు భారీగా సన్నద్ధం
పందెం కోళ్లకు కత్తులు కట్టడంలో నిపుణులను పోలీసులు బైండోవర్‌ చేసినా… ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. ఈ కత్తులను కూడా ప్రత్యేకంగా తయారు చేయిస్తారు. జాతి కోడి పుంజులకు ప్రత్యేక తర్ఫీదు ఇచ్చి కయ్యానికి కాలు దువ్వేలా సిద్ధం చేశారు. అశ్వారావుపేట, పెనుబల్లి, సత్తుపల్లి, దమ్మపేట మండలాల్లోని పలుచోట్ల పందెం కోళ్ల పారాలు నిర్వహిస్తున్నారు. తమిళనాడులోని సేలం జిల్లా నుంచి ప్రత్యేకంగా కోడిగుడ్లను తీసుకొచ్చి పొదిగించి… స్థానికంగా మేలుజాతి కోళ్లతో బ్రీడ్‌ చేసి వాటి పిల్లలను ప్రత్యేకంగా పెంచుతున్నారు. కర్నూలు జొన్నలు, జీడిపప్పు, పిస్తా, బాదంపప్పు తదితర బలవర్థక ఆహారంతో ప్రత్యేకంగా పుంజులను పెంచి పందేనికి సిద్ధం చేశారు. కొందరు ఆంధ్రాలోని గోదావరి, నెల్లూరు జిల్లాల నుంచి కూడా పుంజులు తీసుకు వస్తుండటం గమనార్హం.
సై..సై…
పందెంరాయుళ్లు సై..సై అంటూ పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. ఉమ్మడి జిల్లా సరిహద్దులో బరులు చేసుకున్నారు. అశ్వారావుపేట, వినాయకపురం, నారంవారిగూడెం, తిరుమలకుంట, జమ్మిగూడెం, దమ్మపేట, నాగుపల్లి, పట్వారీగూడెం, పెద్దగొల్లగూడెం, వడ్లగూడెం, సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లోని మేడిశెట్టివారిపాలెం, ముత్తగూడెం, చండ్రుగొండ, ములకలపల్లి మండలాల్లో పలుచోట్ల పందేలు నిర్వహిస్తున్నారు. ఇటు అశ్వారావుపేట మండల సరిహద్దు ఆంధ్రప్రదేశ్‌లోని జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, వేలేరుపాడు, కుక్కునూరు, దమ్మపేట సరిహద్దులోని రాఘవపురం, చింతంపల్లి, సీతానగరం, పట్టాయిగూడెంలో పందేలు జోరుగా సాగుతున్నాయి. ఏటా సంక్రాంతి మూడురోజులు రోజుకు రూ.కోటి చొప్పున మూడు, నాలుగు కోట్లు చేతులు మారుతాయి. పెద్దబరుల్లోనే కాకుండా పైపందేలు సైతం రూ.వేలల్లో కాస్తుంటారు.
కుక్కుటశాస్త్రం ఆధారంగా…
కుక్కుటశాస్త్రం ఆధారంగా పందేలు నిర్వహిస్తారు. నల్లని ఈకల కాకి, ఎర్రని ఈకల డేగ, పసుపు ఈకల నెమలి, నలుపు, ఎరుపు ఈకల కౌజు, తెల్లని ఈకల సేతువ, ఎరుపు, బూడిదరంగు మైల, ముంగిస, అబ్రాసు, పచ్చకాకి, నలుపు, ఎరుపు కాకిడేగ ఇలా రకరకాల పుంజులను కుక్కుటశాస్త్రం ఆధారంగా బరుల్లో దించుతారు. సమయాన్ని బట్టి ఏ కోళ్లు గెలుస్తాయో వాటిని ప్రవేశపెడతారు. ముసుగు పందెం, కత్తి పందెం, విడికాళ్లు, జోడి పందెం, చూపుడు పందెం ఇలా పలు రకాలుగా పందేలు వేస్తారు. పుంజు తీరును బట్టి వాటిపై పందెం ఉంటుంది. బరుల్లో ఉండి కొందరు, బరి బయట మరికొందరు పందేలు కాస్తారు.

Spread the love