ఓటమిని ముందుగా తెలుసుకోవడం సంతోషం: తీన్మార్ మల్లన్న

– ఇది అధికారులపై మన్ను పోసి పోయే కార్యక్రమం
– అన్ని విఫలమై  పట్టు కోల్పోయి మాట్లాడుతున్నారు 
– బిఆర్ఎస్ నాయకులు తుది ఫలితం వచ్చేవరకు వుంటాలి: తీన్మార్ మల్లన్న
నవతెలంగాణ-  నల్గొండ కలెక్టరేట్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు  మీడియా కంటే ముందు, అధికార పక్షంలో ఉన్న మాకంటే ముందు, అధికారుల కంటే ముందు తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టేకే పరిస్థితి లేదని కౌంటింగ్ హాల్ నుండి ఉత్త చేతులతో పోవడం ఎందుకని అధికారుల మీద మన్ను పోసి పోయే కార్యక్రమం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న  మండిపడ్డారు. గురువారం కౌంటింగ్ కేంద్రం వద్ద మాట్లాడారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆర్ వో పై, అదేవిధంగా జిల్లా అధికారులపై చేసిన ఆరోపణలపై  ఆయన మాట్లాడారు. కేటీఆర్ డైరెక్షన్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో  100 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టి అక్రమంగా గెలుపొందాలని చేసిన ప్రయత్నం.. గతంలో మాదిరిగా బోగస్ ఓట్లతో  లబ్ధి పొందాలనే  కుతంత్రం.. అధికార పార్టీ అభ్యర్థిగా ఉన్న నాపై అనేక రకాలుగా బురద చల్లి గెలవాలనే ప్రయత్నాలు బేడిసి కొట్టి ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టుకోల్పోయి మాట్లాడుతున్నారని ద్వజమెత్తారు. ఆట ఆడదాం రావే అంటే పాత గజ్జలు ఉన్నాయి. నేను ఎలా ఆడతా అన్నాడంట. ఆ విధంగా యుద్ధంలో గెలవచేత కాక ప్రజాస్వామ్య యుతంగా  ఎన్నికల్లో పాల్గొంటున్న నాపై అధికారులు సపోర్ట్ చేశారని మాట్లాడడం దుర్మార్గమన్నారు.అధికారులు నా సెల్ ఫోన్ ని కూడా అనుమతించలేదని పేర్కొన్నారు.ఒకవేళ అధికారులు నాకు సపోర్ట్ చేసినట్లయితే ఆ విధంగా జరిగేది కాదన్నారు. బిఆర్ఎస్ ప్రెస్ మీట్ ను చూస్తూ ఉంటే ఓటమిని ఒప్పుకున్నట్లే అనిపిస్తుందన్నారు. బిఆర్ఎస్ వాళ్లు దయచేసి వెళ్లిపోవద్దని.. తుది ఫలితం వచ్చేవరకు ఉండి  కేటీఆర్ ఫోన్ రాగానే మరో కార్యక్రమం చేపట్టే అవకాశం ఉంటుందన్నారు.
Spread the love