నవతెలంగాణ-మిరుదొడ్డి: దుబ్బాకలోని సరస్వతి గ్లోబల్ స్కూల్ పదో తరగతి ఫలితాల్లో వరుసగా 100% ఉత్తీర్ణత సాధించి రికార్డు నెలకొల్పింది. పాఠశాలకు చెందిన ఎనిమిది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించి సత్తా చాటారు. నాజ్రీన్ 549, హిందూ 540, చరణ్ 535, సూర్య తేజ 532, నిఖీష 525 హర్షిత్ గౌడ్ 521, స్ఫూర్తి 516, వైష్ణవి 507 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అంకితభావంతో పనిచేసిన ఉపాధ్యాయ బృందానికి, కష్టపడి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
“మా పాఠశాలలో విద్యార్థులకు బట్టీ చదువులు చెప్పకుండా, జ్ఞానాన్ని అందించే విధంగా బోధన చేశాం. అందుకే ఈ ఫలితం సాధ్యమైంది” అని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులను శాలువాతో ఘనంగా సత్కరించారు. దుబ్బాక పట్టణంలో 100% ఉత్తీర్ణత సాధించిన ఏకైక పాఠశాలగా నిలవడం, ప్రతి సంవత్సరం 100% ఉత్తీర్ణత సాధించడం గర్వంగా ఉందని ప్రిన్సిపల్ వెంకట్ రెడ్డి, పాఠశాల యాజమాన్యం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ బాబా, ఉపాధ్యాయులు యాదగిరి, కనకా రెడ్డి పలువురు పాల్గొన్నారు.



