పతి గెలుపు కోసం- సతి ప్రచారం

– నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసిన వారికి పట్టం కట్టండి
– గాదరి కమల కిషోర్ కుమార్.
నవతెలంగాణ- తుంగతుర్తి:
తుంగతుర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ను గెలిపించాలని ఆయన సతీమణి గాదరి కమల శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ మేరకు గడపగడప తిరుగుతూ మహిళలతో ముచ్చటిస్తూ బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే జరగనున్న అభివృద్ధి అమలు చేయనున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. తుంగతుర్తి నియోజకవర్గం గతంలో అన్ని రంగాల్లో వెనుకబడి ఉండేదని ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో, తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గెలిచిన తర్వాత వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో గాదరి కిషోర్ కుమార్ చేసిన అభివృద్ధి కళ్ళ ముందుకు కనపడుతుందన్నారు. నియోజకవర్గం మారుమూల ప్రాంతంలో ఉండడం చేత వైద్యం కోసం నియోజకవర్గ ప్రజలు పడే ఇబ్బందులను చూడలేక వంద పడకల ఆసుపత్రికి సైతం శంకుస్థాపన చేయడం జరిగింది అన్నారు. కరువు కాటకాలతో బీడు భూములతో ఉన్న తుంగతుర్తి నియోజకవర్గాన్ని కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం చేసిన ఘనత కెసిఆర్ కిషోర్ కుమార్ దే అన్నారు. రానున్న కాలంలో మరింత అభివృద్ధి జరగాలంటే తిరిగి ఎమ్మెల్యేగా డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి మహిళలకు బొట్టు పెడుతూ ఓట్లు వేయాలని ప్రచారం నిర్వహించగా, మంగళ హారతులతో ఆడపడుచులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు, మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, వెలుగుపల్లి ఎంపీటీసీ మట్టిపల్లి కవిత కుమార్, అనిత జనార్ధన్, యాకు నాయక్, ఈరోజి, పులుసు వెంకటనారాయణ, బొంకూరి నాగయ్య, మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love