అనుమతులున్నా అక్రమంగా కూల్చారు: సత్యనారాయణ

నవతెలంగాణ – మంథని
ఇంటి నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నా అక్రమంగా మున్సిపల్‌ అధికారులు కూల్చివేశారని వ్యాపారి వొల్లాల సత్యనారాయణ ఆరోపించారు. బుధవారం మంథనిలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత మూడేళ్ల క్రితం మార్కెట్‌ కమిటి కార్యాలయం ఎదుట మున్సిపల్‌ అనుమతులతో బిల్డింగ్‌ నిర్మాణం చేశానని, ఆ సమయంలో రెండు అంతస్తులకు పర్మిషన్‌ తీసుకోవడం జరిగిందన్నారు. మూడో అంతస్తుకు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నానని, ఇంకా అనుమతులు ఇవ్వలేదన్నారు. అయితే బిల్డింగ్‌ నిర్మాణం పూర్తయిన మూడేళ్ల తర్వాత అనుమతులు లేవంటూ,నోటీసులు ఇచ్చామంటూ మున్సిపల్‌ అధికారులు వచ్చి బిల్డింగ్‌ను ద్వంసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిల్డింగ్‌ నిర్మాణ సమయంలో ఆర్అండ్‌బీ అధికారుల ఆదేశాల మేరకు సెట్‌ బ్యాక్‌తో నిర్మాణం చేశామని తెలిపారు. బిల్డింగ్‌ నిర్మాణానికి సంబంధించిన అన్ని అనుమతులు తన వద్ద ఉన్నాయని,అయినా అధికారులు తనకు అన్యాయం చేశారని వాపోయారు.ఈ విషయంలో ఉన్నతాధికారులు విచారణ చేసి తనకు న్యాయం చేయాలని కోరారు.

Spread the love