భవిష్యత్తును కాపాడండి

the future save– వాతావరణ మార్పులపై శంఖారావం
– కాప్‌28 వేదికపై 12 ఏండ్ల భారతీయ బాలిక నిరసన
దుబాయ్ : లిసిప్రియ కంజుజామ్‌…12 ఏండ్ల భారతీయ బాలిక. వాతావరణ మార్పులపై ఉద్యమిస్తున్న కార్యకర్త. దుబారులో జరుగుతున్న కాప్‌28 వాతావరణ సదస్సు వేదిక పైకి సోమవారం ఆకస్మికంగా ప్రవేశించి అందరికీ ఆశ్చర్యపరచింది. ‘శిలాజ ఇంధనాలకు స్వస్తి చెప్పండి. మన గ్రహాన్ని, భవిష్యత్తును కాపాడండి’ అని రాసిన ప్లకార్డును ప్రదర్శించింది. సభికుల కరతాళ ధ్వనుల మధ్య భద్రతా సిబ్బంది ఆమెను బయటికి తీసికెళ్లారు. తన నిరసనకు సంబంధించిన వీడియోను ఆమె సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. నిరసన అనంతరం తనను 30 నిమిషాల పాటు నిర్బంధించారని ఆమె తెలిపింది. ‘నేను చేసిన నేరం ఏమిటంటే నేడు వాతావరణ సంక్షోభానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాలను వినియోగించవద్దని కోరడమే. అందుకే వారు నన్ను కాప్‌28 సదస్సు నుండి బయటికి గెంటేశారు’ అని చెప్పింది. అనంతరం కంగుజామ్‌ మరో ప్రకటనను పోస్ట్‌ చేసింది. ‘ఈ రోజు వాతావరణ సంక్షోభానికి కారణమవుతున్న బొగ్గు, చమురు, గ్యాస్‌ ఉత్పత్తి, వాడకాన్ని క్రమేపీ నిలిపివేసే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలి. ఈ రోజు మీరు తీసుకునే చర్యలు రేపు మా భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మనం ఇప్పటికే వాతావరణ మార్పులకు బాధితులమయ్యాము. నా భావి తరాల వారు మరోసారి ఇవే పరిణామాలను ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదు. మన నాయకుల వైఫల్యాలకు లక్షలాది మంది అమాయక చిన్నారులను బలి చేయడం ఎట్టి పరిస్థితులలోనూ ఆమోదయోగ్యం కాదు’ అని తెలిపింది.
తన లాంటి లక్షలాది మంది చిన్నారులు వాతావరణ వైపరీత్యాల కారణంగా తమ జీవితాలను, తల్లిదండ్రులను, నివాసాలను కోల్పోతున్నారని కంగుజామ్‌ ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఇది అసలైన వాతావరణ అత్యవసర పరిస్థితి. యుద్ధాల కోసం లక్షలాది డాలర్ల సొమ్మును ఖర్చు చేసే బదులు దానిని ఆకలిని అంతం చేసేందుకు ఖర్చు చేయండి. విద్య కోసం ఖర్చు చేయండి. వాతావరణ మార్పులతో పోరాడటానికి ఖర్చు చేయండి. మనకు పీల్చేందుకు స్వచ్ఛమైన గాలి కావాలి. తాగేందుకు స్వచ్ఛమైన నీరు కావాలి. నివసించేందుకు సురక్షితమైన గ్రహం కావాలి. ఇవన్నీ కోరడం మా ప్రాథమిక హక్కులు’ అని ఆమె వివరించింది.
కాప్‌28లో యువత ప్రదర్శించిన ఉత్సాహాన్ని అభినందిస్తున్నానని, కంగుజామ్‌ను మరోసారి కరతాళధ్వనులతో అభినందించాల్సిందిగా ఆహుతు లను ప్రోత్సహించానని కాప్‌28 డైరెక్టర్‌-జనరల్‌ అంబాసిడర్‌ మజీద్‌ అల్‌ సువైదీ వ్యాఖ్యానించారు. కాగా యూఏఈలో ఐరాస చర్చల వద్ద నిరసనలు తక్కువగానే జరిగాయి. వివిధ సంస్థలు, రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు నిరసన ప్రదర్శనలు జరపకుండా నిషేధం విధించడమే దీనికి కారణం.
ఎవరీ కంగుజామ్‌?
కంగుజామ్‌ 2011 అక్టోబర్‌ 2న జన్మించింది. చైల్డ్‌ మూవ్‌మెంట్‌ సంస్థను స్థాపించింది. ఆరు సంవత్సరాల వయసులోనే ఉద్యమించింది. ప్రపంచంలో వాతావరణ మార్పులపై పోరాడుతున్న కార్యకర్తలలో ఆమే అతి చిన్న వయస్కురాలు. స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో 2019లో జరిగిన ఐరాస వాతావరణ సదస్సులో ప్రపంచ నేతలను ఉద్దేశించి ప్రసంగించింది. తమ భవిష్యత్తును కాపాడేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని వారిని కోరింది. వాతావరణ మార్పులపై పోరాడుతున్న కంగుజా మ్‌ను అనేక అవార్డులు వరించాయి. 2019లో వరల్డ్‌ చిల్డ్రన్‌ పీస్‌ ప్రైజ్‌ లారెట్‌, రైజింగ్‌ స్టార్‌ ఆఫ్‌ ఎర్త్‌డే నెట్‌వర్క్‌, 2020లో గ్లోబల్‌ చైల్డ్‌ ప్రాడిగీ అవార్డ్‌, ప్రతిష్టాత్మక టీఎన్‌ ఖుషూ మెమోరియల్‌ అవార్డ్‌, 2021లో ఫార్బర్‌ 30 అండర్‌ 30 స్పెషల్‌ మెన్షన్స్‌, ఢిల్లీ ప్రభుత్వం నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవ అవార్డు ఆమె సొంతమయ్యాయి.
వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ఆమె 2018 జూలైలోనే ప్రచారోద్యమం ప్రారంభించింది. 2019లో వాతావరణ కార్యకర్త గ్రేటా తున్‌బర్గ్‌ స్ఫూర్తితో మన దేశంలో వాతావరణ మార్పులపై చట్టాన్ని తీసుకొచ్చేలా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి ఆకర్షించేందుకు పార్లమెంట్‌ భవనం వెలుపల ఓ వారం రోజులు గడిపింది.

Spread the love