– వీసాలు రద్దు చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం
– క్యాంపస్ కార్యకలాపాల సాకుతో చర్యలు
– సోషల్ మీడియా పోస్టుల పైనా నిఘా…
– లైక్ కొట్టినా ఇంటికే
అమెరికాలో విద్యాభ్యాసం చేసున్న వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ‘ స్వీయ బహిష్కరణ’ వేటు వేస్తోంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ నుండి విద్యార్థులకు ఈ మెయిల్స్ వస్తున్నాయి. వారిలో కొందరు భారతీయ విద్యార్థులు కూడా ఉండే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్ అటార్నీలు తెలిపారు. ‘మీ ఎఫ్-1 వీసాల (విద్యార్థి వీసాలు)ను రద్దు చేశాం.మిమ్మల్ని దేశం నుండి బహిష్కరించాం. కాబట్టి మీ అంతట మీరు దేశం విడిచి వెళ్లిపోండి’ అంటూ ఆ ఈ మెయిల్ సందేశంలో బాంబు పేల్చారు. 300 మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేయడం జరిగిందని విదేశాంగ మంత్రి మార్కో రుబియో ప్రకటించారు.
వాషింగ్టన్ : రాజకీయ, పర్యావరణ, ఆర్థిక, సామాజిక మార్పుల కోసం విద్యార్థులు తమ క్యాంపస్‌లలో కొన్ని కార్యక్రమాలు చేపడుతుంటారు. ప్రజాస్వామ్యం, పౌర హక్కులు వంటి అంశాలపై ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తారు. వీటిని ‘క్యాంపస్ యాక్టివిజం’గా వ్యవహరిస్తారు. ఇలాంటి చర్యలకు పాల్పడడంతో పాటు సామాజిక మాధ్యమాలలో దేశ వ్యతిరేక పోస్టులు పెడుతున్నారన్న కారణంతో అంతర్జాతీయ విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం ‘స్వీయ బహిష్కరణ’ వేటు వేస్తోంది. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను లైక్ చేసిన వారిపై కూడా బహిష్కరణ పిడుగు పడుతోంది.
మాకు ఆ హక్కుంది
హమాస్, ఇతర ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తున్న విద్యార్థులను గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవడానికి రుబియో ఇటీవలే ‘క్యాచ్ అండ్ రివోక్’ అనే కృత్రిమ మేథ ఆధారిత యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్ ప్రారంభించిన మూడు వారాల వ్యవధిలోనే మూడు వందల మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేశారు. ‘స్వీయ బహిష్కరణ వేటు పడిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ప్రతి రోజూ ఈ చర్యలు కొనసాగుతాయి. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదు. వారి వీసాలను రద్దు చేస్తాం’ అని స్పష్టం చేశారు. ‘ఎవరు రావాలో, ఎవరు రాకూడదో నిర్ణయించే అధికారం ప్రతి దేశానికీ ఉంటుంది’ అని అన్నారు. కాగా సోషల్ మీడియా పోస్టుల పరిశీలన ఆధారంగా అంతర్జా తీయ విద్యార్థులపై స్వీయ బహిష్కరణ వేటు పడుతోంది. అకడమిక్ స్టడీ వీసా (ఎఫ్), ఒకేషనల్ స్టడీ వీసా (ఎం), ఎక్స్ఛేంజ్ వీసా (జే)….ఇలా ఏ వీసా కోసమైనా కొత్తగాదర ఖాస్తు చేసే వారి సోషల్ మీడియా పోస్టులను కూడా జల్లెడ పడతారు. ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇస్తున్నట్లు తేలితే అమెరికాలో చదువుకోకుండా దరఖాస్తుదారులను నిషేధిస్తారు. ఓ తాజా నివేదిక ప్రకారం అమెరికాలో 11 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు విద్యాభ్యాసం చేశారు. వీరిలో 3.31 లక్షల మంది భారతీయ విద్యార్థులే.
ఈ మెయిల్లో ఏముంది?
‘అమెరికా విదేశాంగ శాఖ తరఫున బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ వీసా కార్యాలయం తెలియజేస్తున్న విషయమేమంటే మీకు వీసా జారీ చేసిన తర్వాత కొంత అదనపు సమాచారం లభించింది. దాని ఆధారంగా అమెరికా ఇమ్మిగ్రేషన్-నేషనాలిటీ చట్టంలోని సెక్షన్ 221 (ఐ) ప్రకారం మీ ఎఫ్-1 వీసాను రద్దు చేస్తున్నాము. ఈ విషయాన్ని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి తెలియజేశాము. వారు మీ వీసా రద్దు సమాచారాన్ని మీరు విద్యాభ్యాసం చేస్తున్న సంస్థకు తెలియజేస్తారు. చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ హోదా లేకుండా అమెరికాలో నివసిస్తే జరిమానా, నిర్బంధం, తిప్పిపంపడం వంటి చర్యలు చేపట్టవచ్చు. భవిష్యత్తులో అమెరికా వీసా పొందడానికి మీరు అనర్హులు కూడా కావచ్చు. స్వీయ బహిష్కరణ వేటు పడిన వారు అమెరికాలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని గమనించండి. మిమ్ములను మీ స్వదేశానికి కాకుండా ఇతర దేశాలకు పంపవచ్చు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని వీసా రద్దయిన వారు సీబీపీ హోమ్ యాప్‌ను ఉపయోగించి అమెరికాను వదిలి వెళ్లేందుకు తమ సుముఖత తెలియజేయవచ్చు. అమెరికాను వదలబోయే ముందు మీ పాస్‌పోర్టును వ్యక్తిగతంగా అమెరికా రాయబార కార్యాలయంలో కానీ, వీసా జారీ చేసిన కాన్సులేట్‌లో కానీ విధిగా సమర్పించాలి. వారు దానిని భౌతికంగా రద్దు చేస్తారు. వీసా రద్దయినందున దానిని ఉపయోగించేందుకు ప్రయత్నించకూడదు. భవిష్యత్తులో అమెరికా రావాలని అనుకుంటే మరో వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. మీరు వీసాకు అర్హులా కాదా అనే విషయాన్ని ఆ సమయంలో నిర్ధారిస్తారు’ అని అంతర్జాతీయ విద్యార్థులకు పంపిన ఈ మెయిల్స్‌లో వివరించారు.
స్క్రీన్షాట్లను భద్రపరచండి
ఈ నెల 25వ తేదీ నుండే విద్యార్థులకు ఈ మెయిల్స్ పంపుతున్నారని ఇమ్మిగ్రేషన్ అటార్నీలు తెలిపారు. ఇప్పటికే అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిశీలించాలని రుబియో ఆంతరంగిక ఆదేశాలు జారీ చేశారు. అమెరికా వీసాలు పొందడం జన్మహక్కుగా భావించకూడదని, నిబంధనలను ఉల్లంఘించే వారు దేశం విడిచి వెళ్లిపోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ‘సోషల్ మీడియా పోస్టులను క్షుణ్ణంగా పరిశీలించండి. అవమానకరమైన సమాచారం కన్పిస్తే వాటి స్క్రీన్షాట్లు తీసి భద్రపరచాలి. దరఖాస్తుదారులు తమ పోస్టులను తొలగించేందుకు, మార్చేసేందుకు ప్రయత్నించే అవకాశం ఉన్నందున వాటిని జాగ్రత్తగా భద్రపరచాల్సి ఉంటుంది’ అని ఆయన తన ఆదేశాలలో కాన్సులర్ అధికారులకు సూచించారు.