ఖాకీల సెటిల్మెంట్లు‌..!

– జిల్లాలో పోలీసులపై పెరుగుతున్న అవినీతి ఆరోపణలు
– వివాదాస్పదంగా మారిన ఎస్‌ఐ ఆకస్మిక బదిలీ
– కొందరు పోలీసులు సెటిల్మెంట్లు, పైరవీలకే ప్రాధాన్యం
జిల్లాలో పోలీస్‌ శాఖపై అవినీతి ఆరోపణలు పెరుగుతున్నాయి. ఆ మధ్య కానిస్టేబుల్‌ స్థాయి నుండి ఎస్‌ఐ వరకు సస్పెండ్‌ అయినప్పటికీ మార్పు రావడం లేదు. భూ వివాదాల్లో తల దూరుస్తూ ఒక గ్రూపుకు సపోర్ట్‌ చేస్తూ మరో గ్రూపుపై బెదిరింపులకు పాల్పడుతూ అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్న ఆరోపణలు నిత్యం జిల్లాలో విన్పిస్తున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ పేరుతో సెటిల్మెంట్‌లకు అలవాటు పడ్డారన్న ఆరోపణలు మూటగట్టుకుంటున్నారు. సిబ్బందిని గాడిలో పెట్టేందుకు అధికారులు ప్రత్యేక క్లాసులు, సంస్కరణలు చేపట్టినప్పటికీ కొందరు పోలీసులు అవేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వారికి ఉన్నతాధికారులు మెమోలు జారీ చేస్తున్నప్పటికీ ఈ తంతు మాత్రం మారడం లేదు. జిల్లాలో విత్తనాల అధిక రేటు విక్రయాలు, నకిలీ విత్తనాలు, పీడీఎస్‌ బియ్యం రవాణా జోరుగా సాగుతున్నప్పటికీ అదుపు చేసే స్పెషల్‌ టీం, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నామమాత్రపు దాడులు చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని పలు హోటల్స్‌, లాడ్జిలలో పేకాట, బెట్టింగ్‌ దందాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నప్పటికీ అధికారులెవరూ ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. దందాలకు ఉన్నతాధికారులే మద్దతు తెలపడంతో కింది స్థాయి ఉద్యోగులు కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
నవతెలంగాణ-మంచిర్యాల

మంచిర్యాలలో పని చేస్తున్న ఎస్‌ఐ ఆకస్మిక బదిలీ చర్చనీయాంశంగా మారింది. గత నెలలో మంచిర్యాల లక్ష్మి టాకీస్‌ ఆవరణలో బీఆర్‌ఎస్‌ యువ నాయకుడిపై జరిగిన దాడి విషయంలో ఎస్‌ఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. దాడి చేసిన యువకులపై నామమాత్రపు కేసులు నమోదు చేసి వదిలేశారని తెలుస్తోంది. దాడి తీరును పరిశీలిస్తే నిందితులను రిమాండ్‌ చేయాల్సి ఉండేదని, దాడి విషయంలో కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఉన్నతాధికారులు ఎక్కడ సమస్య ఎదురవుతుందోనని భావించి ఎస్‌ఐని బదిలీ చేసినట్లు అటు పోలీస్‌ శాఖతో పాటు స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఏప్రిల్‌ నెలలో మంచిర్యాల పట్టణం రాజీవ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ తన కూతురు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వీడియోలు చేసే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి పాప ఫొటోలు స్క్రీన్‌ షాట్‌ తీసుకొని వాటిని మార్ఫింగ్‌ చేసి తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసి 4 రోజులు పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిరిగినా ఫలితం లేక పోయింది. ఎన్ని సార్లు వచ్చినా పిటిషన్‌ మరోసారి రాసివ్వాలని స్టేషన్‌లో అధికారులు తెలపడంతో విసుగు చెందిన మహిళ డీసీపీని కలిసి గోడు వెళ్లబోసుకుంది. భర్త వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసిన మరో మహిళా ఉద్యోగి పోలీసుల తీరుపై పట్టణ పోలీస్‌స్టేషన్‌లోనే నిరసనకు దిగింది. తన భర్తతో సెటిల్మెంట్‌ చేసుకున్న పోలీసులు ఫిర్యాదు చేసిన తనపైనే అక్రమ కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులే కొన్ని గ్రూపులకు మద్దతు తెలుపుతూ ఆ గ్రూపుకు చెందిన యువకులు ఎక్కడ అల్లర్లు, గొడవలు చేసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదురవుతున్నాయి. అధికార పార్టీ మద్దతు యువకులకు ఉండడంతోనే సమస్య ఎందుకని భావించి ఆ గ్యాంగ్‌లకు పోలీసులు సహకరిస్తున్నట్లు జిల్లాలో చర్చ కొనసాగుతోంది.
కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు
జిల్లాలో కొన్ని రోజులుగా ఏసీబీ అధికారుల విచారణ జరుగుతున్నట్లు సమాచారం. వైద్య, పోలీస్‌ శాఖతో పాటు పలు శాఖల్లో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టినట్లు జిల్లాలో చర్చ మొదలైంది. పరిమితికి మించిన వైద్యం చేస్తున్నారని పలువురు ఆర్‌ఎంపిలపై పోలీస్‌స్టేషన్‌లలో విజిలెన్స్‌ అధికారులు ఫిర్యాదు చేశారు. వారిపై విచారణ చేపట్టి అనుమతి లేకున్నా వైద్యం చేస్తున్నట్లు రుజువైతే రిమాండ్‌కు తరలించాలని విజిలెన్స్‌, టీఎస్‌ఎంసీ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీన్ని అదునుగా తీసుకున్న కొందరు పోలీసులు కొందరు ఆర్‌ఎంపిలపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించకుండా చూసుకుంటామని బేరసారాలకు పాల్పడినట్టు సమాచారం. ఈ క్రమంలో మంచిర్యాల, లక్షెట్టిపేట, రామకృష్ణాపూర్‌, శ్రీరాంపూర్‌, జన్నారంలో ఆర్‌ఎంపీల వద్ద పోలీసులు ముడుపులు తీసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మంచిర్యాల పట్టణ సీఐని వివరణ కోరగా అలాంటిదేమీ లేదని, విజిలెన్స్‌ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఆర్‌ఎంపిలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

అధికారులెవరైనా వదిలేది లేదు : ఎం.శ్రీనివాస్‌, సీపీ, రామగుండం
అవినీతికి పాల్పడిన వ్యక్తులు ఎంతటి వారైనా వదిలేది లేదు. క్రమశిక్షణ కోల్పోయి చట్టానికి విరుద్ధంగా వ్యవహరించి పోలీస్‌ శాఖకు చెడ్డ పేరు తీసుకొచ్చే ఎంతటి పెద్ద అధికారులైన సరే చర్యలు తీసుకుంటాం. ఏసీబీ దాడులు జరుగుతున్నట్లు సమాచారం వచ్చింది. దానిపై విచారణ కొనసాగిస్తున్నాం. ఆర్‌ఎంపిల విషయంలో వస్తున్న ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. నేరం రుజువైతే చర్యలు తీసుకుంటాం. పోలీస్‌స్టేషన్‌ వివరాలు గోప్యంగా ఉంచకుండా, డ్యూటీలో నిర్లక్ష్యం వహించే అధికారులను కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా బదిలీ చేయడం సహజం. ఫిర్యాదు చేసే ప్రతి ఒక్కరూ పోలీస్‌స్టేషన్‌ నుండి రశీదు తీసుకోవాలి.

Spread the love