గోవాలో దారుణం.. మహిళపై లైంగికదాడి

నవతెలంగాణ – హైదరాబాద్: గోవాలోని అసోనోరా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఉత్తర గోవాలోని అసోనోరా గ్రామంలోని రిసార్ట్‌లో మహిళా టూరిస్ట్‌పై లైంగికదాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై గుజరాత్‌కు చెందిన వ్యక్తిని గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఆగస్టు 23న జరిగింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా, 47 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు లక్ష్మణ్ షియార్‌గా గుర్తించబడ్డాడు. ఆయన పర్యాటకుడిగా గోవా పర్యటనలో ఉన్నాడు. ఆ మహిళ, నిందితుడు ఇంతకు ముందు విమానంలో కలుసుకున్నారని, ఈ నేపథ్యంలో వారి మధ్య స్నేహం కుదిరిందని డీఎస్పీ జీవ్బా దాల్వి చెప్పారు. ఆ తర్వాత మహిళ ఫోన్‌ నంబర్‌ తీసుకుని ఆమెతో టచ్‌లో ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ వారం ప్రారంభంలో సదరు మహిళ, నిందితుడు వేర్వేరుగా గోవాను సందర్శించారు. ఆగస్ట్ 23న అతను ఆమెకు కాల్‌ చేసి అక్కడ ఉన్న పర్యాటక ప్రాంతాలను చూపిస్తానని నమ్మించి, అతను అసోనోరాలోని తాను ఉంటున్న రిసార్టుకు రావాలని కోరాడు. ఆమె ఆ రిసార్టుకు వెళ్లగా.. నిందితుడు ఆమెను తన గదిలోకి తీసుకెళ్లి అక్కడ ఆమెపై లైంగికదాడి చేశాడు. ఈ సంఘటన గురించి ఎవరికీ చెప్పవద్దని అతను ఆమెను బెదిరించాడు. మహిళ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Spread the love