షెపాలీ 205 మంధాన 149

షెపాలీ 205 మంధాన 149– సఫారీలను చితకబాదిన ఓపెనర్లు
– భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 525/4
షెఫాలీ వర్మ (205), స్మృతీ మంధాన (149) చితకబాదారు. యువ ఓపెనర్‌ షెఫాలీ ధనాధన్‌ ద్వి శకతంతో విశ్వరూపం చూపించగా.. స్టార్‌ బ్యాటర్‌ మంధాన భీకర ఫామ్‌ కొనసాగించింది. సఫారీ బౌలర్లను ఉతికారేసిన ఓపెనర్లు భారత్‌కు ఏకైక టెస్టులో రికార్డు స్కోరు అందించారు. ఓపెనర్ల విధ్వంసక ఇన్నింగ్స్‌లో భారత్‌ తొలి రోజు 525/4 పరుగుల భారీ స్కోరు సాధించింది.
నవతెలంగాణ-చెన్నై :
చెపాక్‌ స్టేడియంలో పరుగుల వరద పారింది. భారత మహిళల జట్టు రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో తొలి రోజే రికార్డులను బద్దలు కొట్టింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ (205, 197 బంతుల్లో 23 ఫోర్లు, 8 సిక్స్‌లు) డబుల్‌ సెంచరీతో కదం తొక్కగా.. స్మృతీ మంధాన (149, 161 బంతుల్లో 27 ఫోర్లు, 1 సిక్స్‌) సఫారీలపై మరో సెంచరీ మోత మోగించింది. జెమీమా రొడ్రిగస్‌ (55, 94 బంతుల్లో 8 ఫోర్లు) అర్థ సెంచరీతో రాణించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (42 నాటౌట్‌, 76 బంతుల్లో 2 ఫోర్లు), రిచా ఘోష్‌ (43 నాటౌట్‌, 33 బంతుల్లో 9 ఫోర్లు) అజేయ భాగస్వామ్యంతో దంచికొట్టారు. బ్యాటర్లు అందరూ కలిసికట్టుగా కదం తొక్కటంతో దక్షిణాఫ్రికా మహిళలతో ఏకైక టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. 98 ఓవర్లలో 4 వికెట్లకు 525 పరుగులు చేసింది.
చెపాక్‌ పిచ్‌పై టాస్‌ నెగ్గిన భారత మహిళలు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నారు. తొలి గంట ఆటలో భారత ఓపెనర్లు ఆచితూచి ఆడారు. ఫుల్‌టాస్‌ బాల్స్‌ను సైతం బాదేందుకు చూడలేదు. డ్రింక్స్‌ విరామానికి భారత్‌ 50/0తో నిలిచింది. పిచ్‌ను అర్థం చేసుకుని క్రీజులో కుదురుకున్న ఓపెనర్లు ఆ తర్వాత ఊచకోత మొదలెట్టారు. విధ్వంసక షెఫాలీ వర్మ 197 బంతుల్లోనే ద్వి శతకం నమోదు చేసి రికార్డు నెలకొల్పింది. బౌండరీల రూపంలోనే షెఫాలీ ఏకంగా 140 పరుగులు పిండుకుంది. స్మృతీ మంధాన సైతం వైట్‌బాల్‌ ఫామ్‌ను కొనసాగించింది. 27 ఫోర్లు, ఓ సిక్సర్‌తో కదం తొక్కింది. ఓపెనర్లు శతక మోత మోగించటంతో భారత్‌ తొలి వికెట్‌కు రికార్డు 292 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. షెఫాలీ, మంధాన ఊచకోత ముంగిట సఫారీ పేసర్లు తేలిపోయారు. సతీశ్‌ శుభ (15) నిరాశపరిచినా.. జెమీమా రోడ్రిగస్‌ (55) అర్థ సెంచరీతో మెరిసింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (42 నాటౌట్‌), రిచా ఘోష్‌ (43 నాటౌట్‌) ఐదో వికెట్‌కు అజేయంగా 75 పరుగులు జోడించారు. దీంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో తొలి రోజే 525 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. నేడు ఉదయం సెషన్లో ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో 650 ప్లస్‌ స్కోరు సాధించి డిక్లరేషన్‌ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో టక్కర్‌ (2/141), క్లెర్క్‌ (1/62) వికెట్లు పడగొట్టారు.

Spread the love