– కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లోకి పొంగులేటి ముఖ్య అనుచరుడు
నవతెలంగాణ..హైదరాబాద్ బ్యూరో
మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్య అనుచరుడు అయిన తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. నిన్న మొన్నటి వరకు పొంగులేటితో నడుస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన.. అంతర్గత విబేధాలతో కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజరు కుమార్, బీఆర్‌ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సమక్షంలో హైదరాబాద్‌లో తన అనుచరులతో కలిసి ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాల నుంచి కూడా పలువురు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ స్వభావం తెలుసుకోవడానికి తెల్లం వెంకట్రావుకు నెలకంటే ఎక్కువ సమయం పట్టలేదని అన్నారు.