నవతెలంగాణ-హైదరాబాద్ : జర్మనీలోని ఉత్తర ప్రాంతంలో గల స్టేడ్ పట్టణంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒక యువజన సంక్షేమ కేంద్రంలో (యూత్ వెల్ఫేర్ ఫెసిలిటీ) సోమవారం జరిగిన కాల్పుల ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ కస్టడీ వివాదమే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతులంతా ఆ కేంద్రంలో పనిచేస్తున్న ఉద్యోగులేనని సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. తల్లులు, పిల్లలకు ఆశ్రయం కల్పించే ఈ కేంద్రంలో సోమవారం అకస్మాత్తుగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మహిళలు, ఒక పురుషుడు అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో ఈ దాడిలో మొత్తం మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మరికొందరు ఈ ఘటనలో గాయపడినట్లు తెలుస్తోంది.
తన మూడు నెలల కుమార్తె కస్టడీకి సంబంధించిన చర్చల కోసం కేంద్రానికి వచ్చిన 45 ఏళ్ల వ్యక్తి.. ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడని అధికారులు తెలిపారు. అయితే, ఈ ఘటనలో చిన్నారి, ఆమె తల్లి సురక్షితంగా ఉన్నారని వారు వెల్లడించారు. కాల్పుల అనంతరం కారులో పారిపోతున్న నిందితుడిని, అతనితో పాటు ఉన్న మరో వ్యక్తిని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. కారు టైరు పంక్చర్ కావడంతో వారు పోలీసులకు చిక్కారు. నిందితులను అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు ఎటువంటి కాల్పులు జరపలేదని స్పష్టం చేశారు.
ఈ ఘటన వెనుక ఎటువంటి ఉగ్రవాద కోణం లేదని, ఇది పూర్తిగా వ్యక్తిగత మరియు కుటుంబ కలహాల వల్ల జరిగిన విషాదమని అధికారులు తేల్చిచెప్పారు. ప్రస్తుతం ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని వారు భరోసా ఇచ్చారు. ఘటనా స్థలంలో పోలీసులు ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తును ముమ్మరం చేశారు.



