అడవి జంతువుల కోసం విద్యుత్ తీగలను అమర్చితే కఠిన చర్యలు: ఎస్ఐ శ్రీకాంత్

నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలం లో అడవి జంతువుల వేట కోసం ఎవరైనా వ్యక్తులు విద్యుత్తు తీగలను అమర్చినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుంది అని స్థానిక ఎస్.హెచ్.ఓ ఎస్ఐ శ్రీకాంత్ హెచ్చరించారు. సోమవారం ఆయన పత్రికా ప్రకటన ఒకటి విడుదల చేసారు. అడవి జంతువుల కోసం వేటగాళ్లు అమర్చే విద్యుత్ తీగలతో పంట పొలాలకు పనులకు వెళ్లే రైతులు, మేతకు వచ్చే జంతువులు షాక్ కు గురయ్యి ప్రాణాలను కోల్పోయే అవకాశం ఉందని, మండలంలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుని వన్య మృగాలు, అమాయకులు ప్రాణాలు కోల్పోవడం జరిగిందనీ ఆయన వాపోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ జంతువుల కోసం విద్యుత్ తీగలను ఏర్పాటు చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు. భూపాలపల్లి జిల్లాలో కూంబింగ్ ఆపరేషన్ లో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ అడవిలో అటవీ జంతువులు కోసం అమర్చిన కరెంట్ తీగలకు తగిలి ప్రాణాలను కోల్పోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు. ఎవరైనా వ్యక్తులు ఈ విధంగా కరెంటు తీగలను ఏర్పాటు చేసినట్లు తెలిస్తే వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుంది అన్నారు.
Spread the love