మనం చాలాసార్లు వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన పిల్లల గురించి మాట్లాడుకున్నప్పుడు ‘పిట్ట కొంచెం కూత ఘనం’, ‘పువ్వు పుట్టగానే పరిమళించినట్టు’ వంటి సామెతలు, జాతీయాలు ఉదాహరణగా చెప్పుకుంటుంటాం. నిజానికి ఇప్పుడు అనేక మంది మన పిల్లలు కవులుగా, రచయితలుగా, వ్యాసకర్తలు, బాల సాహితీవేత్తలుగా చక్కగా వెలుగుతున్నారు, రాణిస్తున్నారు. బడిలో పాఠంగా కథలు చదువుకునే పిల్లలు తామే రచయితలుగా మారి కథలు రాస్తున్నారు. టీచర్ చెప్పిన కవితలను, గేయాలను, పద్యాలను చదివి తామే కవులుగా వాటన్నిటిని రాసి పుస్తకాలుగా అచ్చవుతున్నారు. ఆదిలాబాద్ నుండి ఖమ్మం దాకా, సిరిసిల్ల నుండి ఓరుగల్లు దాకా ఈ బాలల సాహిత్యోద్యమం అద్భుత గంగా ప్రవాహంగా సాగుతోంది. వందల పుస్తకాలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. సంకలనాల విషయం పక్కకు పెడితే సంపుటాలకు లెక్క లేదు. 1990 నుండి నేటిదాకా మన పిల్లల రచనల వయ్యిలకు నేను ప్రత్యక్ష సాక్షిని కూడా.
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న చిన్నారి కూడా అటువంటి ప్రతిభావంతురాలే. అందులోనూ పద్య విద్య తెలిసిన చిన్నారి. కాబట్టే ‘అరయ పద్యరచన నందిపుచ్చుకొనుట/ అందరికిని సాధ్యమవదు భువిని/ పలుకులమ్మ కరుణ, భగవదాంశయున్న/ వారి కబ్బు శ్రీజ పద్యరచన’ అంటూ డా.నలువోలు నరసింహారెడ్డి ప్రశంసలకు పాత్రురాలైంది. ఆ పద్యవిద్యా ప్రతిభాశాలి పేరు బెజుగాం శ్రీజ. ఈ అమ్మాయిది సిద్ధిపేట జిల్లా నారాయణరావు పేట మండలంలో ఆగస్టు 21, 2004 నాడు గుర్రాల గొందిలో పుట్టింది శ్రీజ. శ్రీమతి బెజుగాం నర్సవ్వ – శ్రీ వెంకటేశం ఈమె అమ్మానాన్నలు. శ్రీజ పాఠశాల విద్యార్థినిగానే రచనల యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. అక్కడ తెలుగు ఉపాధ్యాయలు వరుకోలు లక్ష్మయ్య మార్గదర్శనంలో పద్య విద్యను ప్రారంభించిన ఈ బాల మొల్ల తరువాత వెనుకకు తిరిగి చూడలేదు. తన బడి జీవితంలో తారసపడిన ప్రతిదానిని పద్యంగా మలిచింది. తరువాత శతకంగా పుస్తకాన్ని కూడా అచ్చువేసుకుంది శ్రీజ. ప్రస్తుతం ఇంజనీరింగ్ నాల్గవ సంవత్సరంలో ఉంది.
అటు పద్యాలతో పాటు కథలను కూడా రాసింది. పదవతరంగతి లోపే అనేక సంకనాలు, సంచికల్లో ఈమె రచనలు వచ్చాయి. బాల కవియిత్రిగా ఎన్నో సత్కారాలు, ఆశీస్సులను అందుకుందీ చిరంజీవి. ఒకరు ‘పద్యరచన చేయు భాగ్యంబు చేకూరె ధన్యురాలువమ్మ మాన్య చరిత’ అంటే, మరొకరు ‘ధృతిలో శ్రీజకు మంచిని కలిగించు భువుడు’ అనగా, సిద్ధిపేట పోతన సామలేటి లింగమూర్తి ‘..సరసర కావ్య ధారలును చక్కగ వ్రాయగ … గొప్ప కీర్తియును దండిగ పొందగ’ అంటూ దీవించారు. కరీంనగర్ సామాజిక సమరసతా వేదిక మొదలుకుని అనేక సంస్థలు నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొంది. సుగుణ సాహితీ సమితి సిద్ధిపేట నగదు బహుమతి, శ్రీకృష్ణ సేవా పురస్కారం, జాతీయ స్థాయి పద్య రచనా పోటీల్లో బహుమతి, గోదావరి రచయితల ప్రశంసా పత్రం, వరకవి సిద్ధప్ప సంకలనంలో చోటు, తెలుగు వెలుగు టి.వి. వారి ప్రశంసా పత్రం వంటివి శ్రీజకు అందిన సత్కారాలు, బహుమతులు.
2001లో అచ్చయిన పుస్తకం ‘శ్రీజ పద్య లహరి’, ఇంది ద్విశతి. పుస్తకం అచ్చు అయ్యేప్పుడు ఇరవై యేండ్లు కూడా రాని చిన్నారి రెండు వందల పద్యాలతో పుస్తకం తేవడం అభినందనీయం. అందుకు ప్రోత్సహించిన శ్రీజ తల్లిదండ్రులు, నేర్పిన వరుకోలు అభినందన పాత్రులు. పద్యాన్ని అందంగా, ఈ బాల కవయిత్రి సరళ సుందరంగా రాసిన కొన్ని మేలిమి మాటలను చూద్దాం- ”ఆకసంబు కన్న అమ్మ యోర్పే మిన్న/ ప్రేమ పంచి పెంచు పేర్మితోడ/ పిల్లల కిల గొప్ప పేరు రావాలని/ కలలు గనుచు బ్రతుకు కన్నతల్లి’ అంటూ తల్లి ప్రేమను చక్కగా చెబుతుందీ చిట్టి తల్లి. ఇంకా… ‘అమ్మ యెపుడు మనకు నానందమును పంచు/ దీవెనలిడు గొప్ప దేవతగను’ అని చెబుతుంది. బాలల గురించి, బాల కార్మికుల గురించి తపన చెంది – ”బాల బాలికలను బాల కార్మికులుగ/ పంపకూడెపుడు పనులు జేయ/ చదువు నేర్పవలయు చక్కగా వారికి/ ప్రగతి పథమునందు పరుగుదీయు” అంటుంది. గ్రామీణ వ్యవసాయ నేపథ్యం శ్రీజది. మరి తన తండ్రిలాంటి రైతుల గురించి, వారి సాధకబాధకాల గురించి రాయకుండా ఎలా ఉంటుంది. ”నలలితముగ రైతు పొలము దున్నుచు/ పెట్టుబడులు పెట్టె పట్టుదలగ/ రావలసిన జలము రాకున్న మడిలోన/ పంటలెండ తలను బాదుకొనెను” అంటూ తాను చూసింది చూసినట్టుగా పద్యం చేసింది.
అంధానాల్లో మనకు కనిపించే దత్తపది, సమస్యాపూరణం వంటివి కూడా శ్రీజ పద్యాల్లో చేసింది. కొన్ని చోట్ల సరళ చిత్రబంధాలతో రాసే ప్రయత్నం చేసింది. లేలేత ప్రాయంలోనే చక్కని పద్య రచన చేసిన శ్రీజను అభినందిస్తున్నాను. ఈ కృషి ఇలాగే కొనసాగాలని ఆశీర్వదిస్తూ… ఆశిస్తున్నాను.
– డా|| పత్తిపాక మోహన్
9966229548