సైలెన్స్‌

సైలెన్స్‌– ముగిసిన ఎన్నికల ప్రచారపర్వం
– ఓటరుదే తుది నిర్ణయం
– సోషల్‌ మీడియాలోనూ ప్రచారం బంద్‌
– కోడ్‌ ఉల్లంఘిస్తే కేసులు తప్పవు
– రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌: ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఎన్నికల ప్రచార రణగొణ ధ్వనులు బంద్‌ అయ్యాయి. ఈ రెండు రోజులూ ఓటరే రారాజు. ఎక్కడైనా ఎన్నికల కోడ్‌ నిబంధనల ఉల్లంఘన జరిగితే పోలీస్‌ కేసులు తప్పవని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ హెచ్చరించారు. రాష్ట్రంలో సైలెంట్‌ పీరియడ్‌ మొదలైందనీ, 144వ సెక్షన్‌ అమల్లోకి వచ్చిందని చెప్పారు. గురువారం జరిగే పోలింగ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మంగళవారంనాడిక్కడి ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వికాస్‌రాజ్‌ మాట్లాడారు. సోషల్‌ మీడియాలోనూ ఎన్నికల ప్రచారం నిషిద్ధమనీ, ఈసీ అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్‌ మీడియాలో అవకాశముంటుందని చెప్పారు. ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు పూర్తయ్యింది. కొన్ని నియోజకవర్గాల్లో శాంతి భద్రతల దృష్ట్యా సాయంత్రం 4 గంటలకే ప్రచారాన్ని నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది.
సోషల్‌ మీడియాతో పాటు సినిమా హాళ్లు, టీవీలు, రేడియోలు, కేబుల్‌ నెట్‌వర్క్‌ల్లో కూడ రాజకీయ ప్రచారం చేయరాదు. రాజకీయపార్టీలు పంచే ఓటరు స్లిప్పులపై పార్టీల గుర్తులు ఉండకూడదు. పోలింగ్‌ ముగిసిన అరగంట తర్వాత వరకు ఎగ్జిట్‌పోల్స్‌ నిషేధం.
ఎన్నికల నిర్వహణ విధుల్లో ఉన్న 1.48 లక్షల మంది ముందస్తుగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం ఉదయం నుంచి డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల నుంచి ఎన్నికల సామాగ్రిని పోలింగ్‌ బూత్‌లకు తరలించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు సహా ఎవరికి ఎక్కడ డ్యూటీలు కేటాయించారనే వివరాలన్నీ సీల్డ్‌ కవర్లలో ఉంటాయి. సంబంధిత సిబ్బంది డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లకు వచ్చాకే ఈ సీల్డ్‌ కవర్లు ఓపెన్‌ చేసి, డ్యూటీలు ఎక్కడ పడిందీ చెప్తారు.
ఓటర్ల తరలింపునకు వాహనాలు సమకూర్చడం నేరం. ఇప్పటికే ఈసీఐఎల్‌ సాంకేతిక సిబ్బంది డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలకు చేరుకున్నారు.
30వ తేదీ ఉదయం 5.30 గంటలకు పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తారు. ఈవీఎమ్‌ల వద్దకు ఏజెంట్లు వెళ్ళకూడదు. అక్కడి వైర్లను తాకరాదు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే సదరు ఏజెంట్లను బూత్‌ నుంచి బయటకు పంపేస్తారు.
27,094 పోలింగ్‌ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్‌ ఉంటుంది. 7,571 ప్రాంతాల్లో పోలింగ్‌ స్టేషన్ల బయట కూడా వీడియో కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూంకు అనుసంధానమై ఉంటాయి.
పోలింగ్‌ స్టేషన్లకు ఈవీఎమ్‌ల తరలింపు రాకపోకలు ఒకే రూట్‌లో జరగాలి. మధ్యలో ఎక్కడా వాహనాలు నిలుపరాదు.
ఓటర్ల సెల్‌ఫోన్లను పోలింగ్‌ బూత్‌లోకి అనుమతించరు. 12 వేలకు పైగా సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.
బీఆర్‌ఎస్‌ పార్టీ బుధవారం నిర్వహించే దీక్షా దివస్‌ అనుమతి కోసం తమకు ఎలాంటి దరఖాస్తులు అందలేదని వికాస్‌రాజ్‌ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఓడిపోతే తన శవయాత్ర జరుగుతుందని ఎన్నికల ప్రచారంలో కామెంట్‌ చేసిన పాడి కౌశిక్‌రెడ్డి అంశం ఇంకా తమ దృష్టికి రాలేదనీ, ఎన్నికల పరిశీలకుల నివేదిక వచ్చాక చూస్తామని అన్నారు.
స్థానికేతరులు నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలి. పోలింగ్‌ సరళి పరిశీలనకు అభ్యర్థితో పాటు ఒకే వాహనానికి అనుమతి ఉంటుంది.
పోలింగ్‌ కేంద్రాల నుంచి ఈవీఎమ్‌లు స్ట్రాంగ్‌ రూములకు వెళ్లే వరకు సదరు వాహనాలను అభ్యర్థి లేదా వారి తరఫు ఏజెంట్లు ఫాలో కావొచ్చు.
మొత్తం 35,655 పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటు. తొలిసారిగా 27,178 మంది ఇండ్ల నుంచి ఓట్లు వేశారు.
ఓటరు స్లిప్‌ ఓటరు గుర్తింపు కాదు. అది కేవలం సమాచార పత్రం మాత్రమే. ఓటరు ఆ స్లిప్‌తో పాటు తప్పనిసరిగా ఎన్నికల సంఘం సూచించిన ఫోటో గుర్తింపు కార్డుల్ని వెంట తీసుకెళ్లాలి.
ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు నిర్వహించిన తనిఖీల్లో రూ.737 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
పోలింగ్‌ రోజున రాష్ట్రంలోని ప్రయివేటు సంస్థలు, ఐటీ కంపెనీలు తప్పనిసరిగా సెలవు ప్రకటించాలి. ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాలి. 2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో పలు సంస్థలు సెలవులు ఇవ్వలేదనే ఫిర్యాదులు వచ్చాయి. అందువల్ల ఈసారి అన్ని సంస్థలు సెలవు ఇచ్చాయో, లేదో కార్మిక శాఖ పరిశీలించాలి. అందుకు భిన్నంగా వ్యవహరించే సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.

Spread the love