సెమీస్‌లో సింధు

సెమీస్‌లో సింధు– మలేషియా మాస్టర్స్‌ 2024
– క్వార్టర్స్‌లో టాప్‌సీడ్‌పై గెలుపు
– పోరాడి ఓడిన అష్మిత చాలిహ
కౌలాలంపూర్‌ (మలేషియా): భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ షట్లర్‌ పి.వి సింధు మలేషియా ఓపెన్‌లో సెమీఫైనల్స్‌కు చేరుకుంది. సీజన్‌లో తొలి టైటిల్‌ అందుకునే పట్టుదలతో కౌలాలంపూర్‌కు వచ్చిన హైదరాబాదీ అమ్మాయి.. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో టాప్‌ సీడ్‌ షట్లర్‌ను చిత్తు చేసింది. ప్రీ క్వార్టర్స్‌లో అనామక షట్లర్‌తో మూడు గేముల పాటు పోరాడిన సింధు క్వార్టర్‌ఫైనల్లో వరల్డ్‌ నం.6, చైనా షట్లర్‌ హన్‌ యు ముందు నిలుస్తుందనే అంచనాలు ఎక్కువగా లేవు. కానీ కఠిన ప్రత్యర్థులపై నాణ్యమైన ఆటతీరు కనబరిచే సింధు మరోసారి అదే ప్రదర్శన పునరావృతం చేసింది. 55 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో 21-13, 14-21, 21-12తో చైనా షట్లర్‌ను సింధు ఓడించింది. నేడు మహిళల సింగిల్స్‌ టైటిల్‌ పోరు బెర్త్‌ కోసం థారులాండ్‌ షట్లర్‌ బుసానన్‌తో పి.వి సింధు తలపడనుంది. వరల్డ్‌ నం.20 బుసానన్‌పై ముఖాముఖి మ్యాచుల్లో 17-1తో ఎదురులేని రికార్డుంది. మహిళల సింగిల్స్‌ యువ షట్లర్‌ అష్మిత చాలిహ పోరాటం క్వార్టర్‌ఫైనల్లోనే ముగిసింది. ఆరో సీడ్‌ చైనా షట్లర్‌ జాంగ్‌ చేతిలో 10-21, 15-21తో వరుస గేముల్లో ఓటమి పాలైంది.
వరల్డ్‌ నం.15 పి.వి సింధు ఇటీవల వరుస టోర్నీల్లో నిరాశపరిచింది. ప్రీ క్వార్టర్స్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో క్వార్టర్‌ఫైనల్లో టాప్‌ సీడ్‌, వరల్డ్‌ నం.6 చైనా షట్లర్‌కు తగ్గ పోటీ ఇస్తుందని అనిపించలేదు. క్లాస్‌కు ఫామ్‌తో సంబంధం లేదని నిరూపించిన సింధు మూడు గేముల మ్యాచ్‌లో పైచేయి సాధించింది. తొలి గేమ్‌లో సింధు 21-13తో పైచేయి సాధించింది. ఏ దశలోనూ సింధుకు హన్‌ పోటీ ఇవ్వలేకపోయింది. రెండో గేమ్‌లో సింధు తడబాటుకు గురైంది. విరామ సమయానికి 11-3తో హన్‌ తిరుగులేని ఆధిక్యం సాధించింది. ద్వితీయార్థంలోనూ ముందంజలో నిలిచి 21-14తో లెక్క సమం చేసింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు గొప్పగా పుంజుకుంది. ఆరంభంలోనే వరుసగా ఆరు పాయింట్లు సాధించి విరామ సమయానికి 11-3తో పట్టు బిగించింది. హన్‌ పుంజుకునేందుకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. 21-12తో మూడో గేమ్‌తో పాటు సెమీఫైనల్స్‌ బెర్త్‌ కైవసం చేసుకుంది.

Spread the love