రెండోరౌండ్‌కు సింధు, ప్రణయ్

Sindhu, Prannoy advance to second round– ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌
నింగ్బో(చైనా): ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. బుధవారం జరిగిన పోటీల్లో లక్ష్యసేన్‌తోపాటు కిదాంబి శ్రీకాంత్‌ తొలిరౌండ్‌లోనే ఓటమిపాలవ్వగా.. మహిళల సింగిల్స్‌లో పివి సింధు రెండోరౌండ్‌లోకి దూసుకెళ్లింది. మూడుసెట్ల హోరాహోరీ పోరులో సింధు 18-21, 21-14, 21-19తో జె.డబ్ల్యు.గో(కజకిస్తాన్‌)పై చెమటోడ్చి నెగ్గింది. మరో పోటీలో మాల్విక బన్సోద్‌ 18-21, 19-21తో వై.జె.సిమ్‌(కొరియా) చేతిలో ఓటమిపాలైంది. ఇక పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్ 17-21తో తొలిగేమ్‌ను చేజార్చుకున్నా.. ఆ తర్వాత రెండు గేమ్‌లను 23-21, 23-21తో చైనాకు చెందిన లూను చిత్తుచేసి రెండోరౌండ్‌కు చేరాడు. ఇతర పోటీల్లో కిదాంబి శ్రీకాంత్‌ 14-21, 13-21తో గింటింగ్‌(ఇండోనేషియా), ప్రియాన్షు రాజ్‌వత్‌ 9-21, 13-21తో జడ్‌.జె.లీ(మలేషియా) చేతిలో వరుససెట్లలో ఓడాడు. మరో పోటీలో లక్ష్యసేన్‌ 19-21, 15-21తో చైనా షట్లర్‌ షీ చేతిలో ఓడి ఇంటిదారి పట్టాడు. ఇక పురుషుల డబుల్స్‌లో కెపి గరగ-ప్రీత్‌ జంట 14-21, 17-21తో చైనా షట్లర్ల చేతిలో, రథినసబపతి-అంసకరువన్‌ జంట 15-21, 14-21తో మలేషియా జంట చేతిలో పరాజయాన్ని చవిచూశారు.

Spread the love