జులై 5న సింగరేణి బంద్‌

Singareni Bandh on 5th July– 15 రోజులపాటు దీక్షలు, నిరసనలు, కలెక్టరేట్ల ముట్టడి
– బొగ్గుగనుల ప్రయివేటీకరణతో భవిష్యత్తు అంధకారం
– ప్రజలపై భారాలు పెరిగే ప్రమాదం
– వేలంపాటకు వ్యతిరేకంగా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలి
– పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదు : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో బొగ్గు గనుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా వచ్చేనెల ఐదో తేదీన సింగరేణి (కోల్‌బెల్ట్‌) బంద్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. 15 రోజులపాటు సీపీఐ, ఏఐటీయూసీ, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు, నిరాహారదీక్షలు, జిల్లాల కలెక్టర్‌ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ‘తెలంగాణ ఆవిర్భవిస్తే మన బొగ్గు గనులు మనకే ఉంటాయి. కొత్త గనులు వస్తాయి. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి.’అని మాజీ సీఎం కేసీఆర్‌ చెప్పారని గుర్తు చేశారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో పూర్తిగా నిరాశే మిగిలిందని అన్నారు. సింగరేణిపై ఉద్యమ కాలంలో ఇచ్చిన మాటకు భిన్నంగా కేసీఆర్‌ పాలన సాగించారని విమర్శించారు. మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ (డెవలప్‌మెంట్‌ రెగ్యులేషన్‌) సవరణ చట్టం-2015 ద్వారా బొగ్గు గనులు రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో నుంచి ప్రయివేటుపరం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా అదానీ, అంబానీలకు బొగ్గు గనులను అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆ చట్టం ద్వారా కుట్ర చేసిందన్నారు. నాటి సీఎం కేసీఆర్‌ కేంద్రానికి సహకరించారని విమర్శించారు. కేసీఆర్‌ ఆనాడు చేసిన పాపమే ఇప్పుడు సింగరేణికి శాపంగా మారిందని అన్నారు. ప్రమాదకరమైన ఆ చట్టం గురించి ఎందుకు నోరు మెదపలేదో కేసీఆర్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సింగరేణి భవిష్యత్తు, మనుగడ ప్రమాదంలో పడ్డాయని చెప్పారు. సింగరేణి బొగ్గు టన్నుకు రూ.3,500 నుంచి రూ.4,500కు విక్రయించాలని వివరించారు. అదానీ, అంబానీ అయితే టన్ను బొగ్గును రూ.18 వేలకు విక్రయిస్తారని చెప్పారు. సింగరేణి బొగ్గు గనుల ప్రయివేటీకరణ వల్ల బొగ్గు ధర పెరుగుతుందనీ, విద్యుత్‌, సిమెంట్లు, ఇనుము ధరలు పెరిగి ప్రజలపై భారాలు పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. బొగ్గు గనుల వేలం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ధైర్యంగా ఉండాలనీ, ప్రజల అభిష్టానికి అనుగుణంగా వ్యవహరించాలనీ, కేంద్రంతో పోరాడాలని కోరారు. వేలం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అయోమయంలో ఉందనీ, వేలంలో పాల్గొంటే వస్తాయో రావోననీ, పాల్గొనకుంటే ప్రయివేటు వ్యక్తులకు కట్టబెడతారన్న ఆందోళన ఉందన్నారు. సింగరేణిని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంద చెప్పారు. సింగరేణి పరిరక్షణ, బొగ్గు గనుల వేలంపాట విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అబద్దాలు మాట్లాడారని విమర్శించారు. సింగరేణిని ప్రయివేట్‌ పరం చేయబోమంటూనే గనుల వేలం పాటకు తెరలేపడం దుర్మార్గమన్నారు. కొత్త బొగ్గు గనులను ప్రయివేట్‌ వ్యక్తుల చేతుల్లోకి అప్పగించే ప్రధాని మోడీ కుట్రలో కిషన్‌రెడ్డి భాగస్వామ్యం అయ్యారని అన్నారు. గతంలో ప్రయివేట్‌ వ్యక్తులకు ఇచ్చిన బొగ్గు గనుల లీజు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌, కేటీఆర్‌కు లేదని కూనంనేని అన్నారు. 2018లో బీఆర్‌ఎస్‌కు 88 ఎమ్మెల్యే సీట్లున్నా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలేదా?అని ప్రశ్నించారు.
ప్రయివేటు సంస్థలకు లాభాలే పరమావధి : అజీజ్‌పాషా
బొగ్గు గనులను నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కార్మికుల సంక్షేమంతోపాటు ప్రజలకు మేలు కలుగుతుందనీ, తక్కువ ధరకే బొగ్గు లభిస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌పాషా అన్నారు. గనులను ప్రయివేటీకరిస్తే ఆ సంస్థలకు లాభాలే పరమావధి తప్ప ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోబోవని చెప్పారు. కార్మికులను దోపిడీ చేస్తాయన్నారు. బొగ్గు గనుల ప్రయివేటీకరణను నిలిపేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. సింగరేణి బొగ్గు గనులు ప్రయివేటుపరం అయితే అందులో పనిచేసే కార్మికులకే కాకుండా ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుందని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ అనుబంధం) అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్‌ బాలమల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love