అంబులెన్సు లేక బైకుపై సోదరి మృతదేహం

లక్నో : అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో ఒక యువకుడు సోదరి మృతదేహాన్ని బైకుపై తీసుకెళ్లాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఆరయాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బుధవారం బిధునా ప్రాంతానికి చెందిన ఒక యువతి వాటర్‌ హీటర్‌ రాడ్డు వల్ల విద్యుదాఘాతానికి గురైంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను స్థానిక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు. పరిశీలించిన డాక్టర్లు ఆ యువతి చనిపోయిందని చెప్పారు.
కాగా, ఆశ వీడని సోదరుడు తన సోదరిని మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని భావించాడు. అయితే అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో తన బైకుపై తీసుకెళ్లాడు. ఆ యువకుడు ఏడుస్తూ చనిపోయిన సోదరిని తన బైకుపై తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్‌లో వైద్య సౌకర్యాల కొరతపై ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Spread the love