Saturday, June 27, 2026
E-PAPER
Homeజాతీయంఆపరేషన్ సిందూర్ లో అమరులు ఆరుగురు

ఆపరేషన్ సిందూర్ లో అమరులు ఆరుగురు

- Advertisement -

ఏడాది తర్వాత జవాన్ల పేర్లు ప్రకటించిన కేంద్రం
నేషనల్ వార్ మెమోరియల్ వెబ్‌సైట్‌లో
‘రోల్ ఆఫ్ ఆనర్-2025’లో చోటు
తెలుగు అగ్నివీర్ మురళీ నాయక్ సహా
ఆరుగురికి దేశం నివాళి


న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆరుగురు అమరవీరుల పేర్లను కేంద్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా వెల్లడించింది. దేశ రక్షణలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి వీరమరణం పొందిన ఆ జవాన్ల వివరాలను నేషనల్ వార్ మెమోరియల్ అధికారిక వెబ్‌సైట్‌లోని ‘రోల్ ఆఫ్ ఆనర్-2025’ జాబితాలో చేర్చారు. త్వరలో న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకంలో ప్రత్యేక శిలాఫలకాలపై వారి పేర్లను శాశ్వతంగా చెక్కనున్నారు.’ఆపరేషన్ సిందూర్’లో భారత సైన్యానికి చెందిన ఐదుగురు, భారత వైమానిక దళానికి చెందిన ఒకరు వీరమరణం పొందారు. వీరిలో సుబేదార్ మేజర్ పవన్ కుమార్ (10 ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్స్), రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్ (4వ బెటాలియన్, జమ్మూ కశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ), లాన్స్ నాయక్ దినేశ్ కుమార్ (5 ఫీల్డ్ రెజిమెంట్), హవిల్దార్ సునీల్ కుమార్ సింగ్ (237 ఫీల్డ్ వర్క్‌షాప్), అగ్నివీర్ మురళీ నాయక్ (851 లైట్ రెజిమెంట్), భారత వైమానిక దళానికి చెందిన సార్జెంట్ సురేంద్ర కుమార్ ఉన్నారు. దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన వీరి సేవలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించి జాతీయ స్థాయిలో గౌరవించింది. ఈ అమరవీరుల్లో రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్‌కు మరణానంతరం దేశంలోని మూడో అత్యున్నత యుద్ధ పురస్కారమైన ‘వీర చక్ర’ను ప్రకటించారు. అలాగే భారత వైమానిక దళానికి చెందిన సార్జెంట్ సురేంద్ర కుమార్‌కు ‘వాయుసేన మెడల్’ ప్రదానం చేశారు. ఇటీవల రాష్ట్రపతి భవన్‌లో జరిగిన రక్షణ పురస్కారాల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్ తల్లిదండ్రులు వీరచక్రను అందుకున్నారు.

దేశ రక్షణలో చూపిన అసాధారణ ధైర్యానికి గుర్తింపుగా ఈ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది.ఈ ఆరుగురిలో తెలుగు వ్యక్తి అగ్నివీర్ మురళీ నాయక్ పేరు ఉంది. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా కళ్లితండాకు చెందినవారు. 2022లో అగ్నివీర్‌గా భారత సైన్యంలో చేరిన మురళీ నాయక్ తొలుత పంజాబ్, అసోంలో విధులు నిర్వహించారు. అనంతరం జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ సైనికుడు దేశం కోసం ప్రాణత్యాగం చేయడం అప్పట్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.గత ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. దీనికి ప్రతీకారంగా భారత్ మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక, సైనిక దాడులు నిర్వహించింది. ఉగ్రవాద మౌలిక సదుపాయాలనే లక్ష్యంగా చేసుకుని భారత సాయుధ దళాలు ఈ ఆపరేషన్‌ను అత్యంత వ్యూహాత్మకంగా అమలు చేశాయి.

ఇప్పుడు అధికారికంగా…
ఇప్పటి వరకు ‘ఆపరేషన్ సిందూర్’లో వీరమరణం పొందిన జవాన్ల వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా నేషనల్ వార్ మెమోరియల్ వెబ్‌సైట్‌లో వారి పేర్లను ‘రోల్ ఆఫ్ ఆనర్-2025’లో చేర్చడంతో ఈ ఆరుగురు అమరవీరుల త్యాగానికి దేశం అధికారిక గుర్తింపు ఇచ్చినట్టైంది. త్వరలో జాతీయ యుద్ధ స్మారకంలోని శిలాఫలకాలపై వారి పేర్లు శాశ్వతంగా చెక్కనుండటంతో భారత సైనిక చరిత్రలో వారి సేవలు చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి. దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన ఈ వీరజవాన్లకు యావత్ దేశం మరోసారి ఘనంగా నివాళులర్పిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -