ఇంట్లో చలి మంటలు.. ఆరుగురు మృతి

నవతెలంగాణ – న్యూఢిల్లీ: చలిని తట్టుకునేందుకు రాత్రి పడుకునే ముందు ఇంట్లో చలి మంటలు వేసుకున్నారు. అయితే ఆ పొగ వల్ల ఊపిరాడక ఆరుగురు మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలోని రెండు ప్రాంతాల్లో ఈ సంఘటనలు జరిగింది. ఉత్తర ఢిల్లీలోని ఒక ఇంట్లో భార్యాభర్తలు, 7, 8 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు మరణించినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటి డోర్‌ లోపల నుంచి లాక్‌ వేసి ఉండటంతో పగులగొట్టి లోనికి వెళ్లి చూశారు. చలిని తట్టుకునేందుకు శనివారం రాత్రి వేళ చలి మంటలు వేసుకోవడంతో పొగ వల్ల ఊపిరాడక ఆ నలుగురు మృతి చెందినట్లు పోలీసులు నిర్థారించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  కాగా, పశ్చిమ ఢిల్లీలోని ఇంద్రపురి ప్రాంతంలో కూడా ఇదే తరహాలో మరో సంఘటన జరిగింది. నేపాల్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించారు. వారిని ఆసుపత్రికి తరలించగా అక్కడ మరణించారు. చలిని తట్టుకునేందుకు ఇంట్లో మంటలు వేసుకోవడం వల్ల పొగ వల్ల ఊపిరాడక వారు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతులు నేపాల్‌కు చెందిన 57 ఏళ్ల రామ్ బహదూర్, 22 ఏళ్ల అభిషేక్‌గా గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love