సమ్మర్‌లో మాత్రమే దొరికే తాటి ముంజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తియ్యగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ఇవి. అందుకే వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాదు ఇవి తింటే ఒంటికి చలువ చేస్తుంది. శరీరానికి కలిగించే చలువ వల్ల దీన్ని ‘ఐస్ యాపిల్’ అని కూడా పిలుస్తుంటారు. మండే ఎండల్లో లేత తాటి ముంజలను తింటుంటే ఆ టేస్ట్ ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అయితే ఎప్పుడూ ఒకేలా తింటే ఏం బాగుంటుంది. వీటితో కొన్ని రకాల రెసిపీలు తయారు చేసి ఆరగించవచ్చు. ఈ మండే ఎండల్లో ఇంటిల్లిపాదీ మస్త్ ఎంజారు చేస్తూ తినేస్తారు. పైగా ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సులువు! మరి, అవేంటి? వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
తాటిముంజల పాయసం
కావాల్సిన పదార్థాలు: పాలు – 750ఎంఎల్, పంచదార – ముప్పావు కప్పు, తాటి ముంజలు – 6, యాలకుల పొడి – 2 చిటికెళ్లు, వేయించిన సన్నని బాదం పలుకులు – 1 టేబుల్ స్పూను.
తయారీ విధానం: ముందుగా స్టౌపై ఒక గిన్నె పెట్టుకొని పాలను తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత అందులో పంచదార యాడ్ చేసుకొని మరో రెండు పొంగులు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. పంచదార పూర్తిగా కరిగి, పాలు కాస్త చిక్కగా మారాయనుకున్నాక స్టౌ ఆఫ్ చేసుకొని దింపి పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు లేతగా ఉన్న తాటి ముంజలు తీసుకొని పై చెక్కును తొలగించుకోవాలి.
ఆపై వాటిని శుభ్రంగా కడిగి పల్లీ లేదా ఛోలే సైజ్‌లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. (పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవద్దు). కట్ చేసిన తాటి ముంజల ముక్కలు, తాటి ముంజల నీటిని పూర్తిగా చల్లారిన పాలలో వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో యాలకుల పొడి, వేయించిన సన్నని బాదం పలుకులు వేసుకొని మరోసారి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని ఫ్రిడ్జ్‌లో కనీసం 2 నుంచి 4 గంటల పాటు ఉంచాలి. అంతే తాటి ముంజల పాయసం రెడీ. ఇలా ఫ్రిడ్జ్‌లో ఉంచడం వల్ల ముంజల ముక్కలకు చల్లదనం పట్టి తాగుతున్నప్పుడు చాలా రుచికరంగా ఉంటుంది పాయసం.
మిల్క్ షేక్
కావాల్సిన పదార్థాలు: ముంజలు – 5, పాలు – కప్పు, వెనిల్లా ఐస్‌క్రీం – రెండు స్కూపులు, కండెన్స్‌డ్ మిల్క్- మూడు చెంచాలు, డ్రైఫ్రూట్స్- రెండు చెంచాలు, ఐస్ క్యూబ్స్ – కొన్ని.
తయారీ విధానం : ముందుగా తాటి ముంజలను పొట్టు తీసి, శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ముంజల ముక్కలు సగం, పాలు, చక్కెర, కండెన్స్‌డ్ మిల్క్, ఐస్‌క్రీం, ఓ చెంచా డ్రైఫ్రూట్స్ వేసి చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని గ్లాసులలో పోసుకొని సన్నగా తరిగిన మిగిలిన ముంజల ముక్కలు, డ్రైఫ్రూట్స్ తరుగు, కొన్ని ఐస్ ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. చల్లచల్లగా అదిరిపోయే ‘తాటి ముంజల మిల్క్ షేక్’ రెడీ.
జ్యూస్
కావాల్సిన పదార్థాలు: తాటి ముంజలు – 4, పాలు – 1 లీటర్, పంచదార – 1/4 కప్పు (రుచికి తగినట్లుగా), నిమ్మరసం – 1 టీ స్పూను, పుదీనా ఆకులు – కొద్దిగా (ఇష్టమైతే), ఐస్ క్యూబ్స్ – తగినన్ని.
తయారీ విధానం: తాటి ముంజలను శుభ్రం చేసి, గుజ్జును పక్కకు తీయండి. గుజ్జును ఒక బ్లెండర్లో వేసి పాలు, పంచదార, నిమ్మరసం, పుదీనా ఆకులు వేసి బాగా కలపాలి. మిశ్రమాన్ని ఒక గ్లాసులో పోసి, ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయండి.
మ్యాంగో స్మూతీ
కావాల్సిన పదార్థాలు: తాటి ముంజలు – 4, మామిడిపండు – ఒకటి, పాలు – కప్పు, పంచదార – 2 చెంచాలు, ఐస్‌క్రీం – రెండు స్కూపులు, ఐస్‌ముక్కలు – 8.
తయారీ విధానం: ముందుగా తాటి ముంజలపై ఉండే పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
అలాగే, మామిడి పండుని కూడా చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచాలి. ఇప్పుడు మిక్సీజార్ తీసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కలు, ముంజలు సగం, పాలు, పంచదార, ఐస్‌క్రీం వేసుకొని చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని గ్లాసుల్లోకి తీసుకొని మిగిలిన ముంజల ముక్కలు, కొద్దిగా ఐస్‌క్రీం, ఐస్ ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. కమ్మని ‘ముంజల మ్యాంగో స్మూతీ’ సిద్ధం.
ప్రయోజనాలు
– ఎక్కువ నీటి శాతం కలిగి ఉండే తాటి ముంజలు శరీరాన్ని చల్లబరచడానికి, డీహైడ్రేషన్ నివారించడానికి, రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు మలబద్ధకాన్ని నివారించడానికి సహకరిస్తుంది.
– దీనిలోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి సహకరించడంతో పాటు మధుమేహులకు ఎంతో మంచిది. ముంజల్లోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, చర్మ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. ఇందులోని పొటాషియం లివర్ సంబంధిత రుగ్మతలను తగ్గిస్తుంది.
– వివిధ రకాల ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే ఫైటోకెమికల్స్, ఆంథోసయనిన్ లాంటి వాటిని తాటి ముంజలు నిర్మూలిస్తాయని పరిశోధనల్లో తేలింది. తాటి ముంజలు తినే వారు కొన్ని రకాల క్యాన్సర్ బారిన పడే అవకాశం తక్కువగా ఉందని 2018లో ‘పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్’ జర్నల్ ఓ అధ్యయనాన్ని ప్రచురించింది. గ్యాస్ట్రిక్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని వెల్లడించింది.
– తాటి ముంజల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ క్యాన్సర్, యాంటీ-డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
– గర్భిణులు తాటి ముంజలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తద్వారా జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుందని, మలబద్ధకం, ఎసిడిటీ లాంటి ఆరోగ్య సమస్యల్ని ఈ పండ్లు దూరం చేస్తాయని తెలిపారు.
– ఎండాకాలంలో కొంత మందికి ముఖంపై వచ్చే చిన్న చిన్న మొటిమ ల్లాంటి పొక్కులను తాటి ముంజలు అడ్డుకుంటాయి. శరీరానికి కావాల్సిన మినరల్స్, చక్కెర పదార్థాలను సమతుల్యం చేస్తాయి.
– వడదెబ్బ బారిన పడిన వారికి నిమ్మరసంతో ఎలాంటి ఫలితం లేకపోతే తాటి ముంజలు తినిపించడం మంచిది.