– 400 స్టాక్స్ 53 శాతం మేర పతనం
– టారీఫ్ దెబ్బలకు విలవిల
– రిటైల్ ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస పతనంతో చిన్న షేర్లు చితికి పోతున్నాయి. తక్కువ విలువ కలిగిన ఈ షేర్లలో అత్యధికంగా సాధారణ రిటైల్ మదుపర్లు ఎన్నో ఆశలతో పెట్టిన పెట్టుబడులు ఆవిరి అయిపోతున్నాయి. ఇటీవల నెలన్నర రోజులుగా వరుసగా పడిపోతున్న స్టాక్ మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోకపోవడంతో ఇన్వెస్టర్లలో తీవ్ర నిరాశ నెలకొంది. కేవలం గడిచిన ఒక్క వారంలోనే 400 స్మాల్ క్యాప్ షేర్లు ప్రతికూల రిటర్న్‌లను ఇచ్చాయి. అందులో 23 షేర్లు రెండంకెల స్థాయిలో క్షీణించాయి. ఇందులో సూరత్‌వాలా బిజినెస్ గ్రూప్ షేర్ అత్యధికంగా 53 శాతం పతనమయ్యింది. ఇదే బాటలో బెస్ట్ అగ్రోలైఫ్ 31 శాతం, డీ డెవలప్‌మెంట్ ఇంజనీర్స్ 27 శాతం, పిటిసి ఇండిస్టీస్ 21 శాతం చొప్పున నష్టపోయాయి. కేవలం ఐదు సెషన్లలోనే ఈ స్థాయిలో షేర్లు పడిపోవడంతో అందులో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు బోరుమంటున్నారు. బిఎస్‌ఇ-500 విభాగంలో దాదాపు 225 షేర్లు నేల చూపులు చూశాయి. మహీంద్రా లాజిస్టిక్స్, కర్బోరుండుమ్ యూనివర్శల్, వక్రంగీ, క్రెడిట్ అక్సెస్ గ్రామీన్, నాట్కో ఫార్మా, క్రిసిల్, మహీంద్రా అండ్ మహీంద్రా, జమ్నా ఆటో, ది ఇండియా సిమెంట్స్ షేర్లు అధిక పేలవ ప్రదర్శన కనబర్చిన వాటిలో ఉన్నాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ బేర్ గుప్పిట్లో చిక్కుకున్నాయి. దాదాపు 27 స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా నష్టాలను చవి చూశాయి. ఎంతో ఆశగా చిన్న షేర్లు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు కలిగిన రిటైల్ మదుపర్లు ఊహించని నష్టాలతో కన్నీరుమున్నీరు అవుతోన్నారు. గడిచిన ఏడాది కాలం సిప్‌ల్లో ప్రతికూల రిటర్న్‌లు నమోదవుతున్నాయి. భారత్‌పై బరోబర్ సుంకాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన భారత మార్కెట్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న విషయం తెలిసిందే.